Local Body Elections | హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు విషయంలో కొత్త చిక్కుముడి వచ్చిపడింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు ట్రిపుల్ టెస్ట్ నిర్వహించి నివేదిక ఇవ్వనున్న ప్రస్తుత బీసీ కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగియనున్నది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించడానికి కొత్త కమిషన్ వేయడం కంటే ప్రస్తుతం ఉన్న బీసీ కమిషన్ గడువును మరికొంత కాలం పొడిగిస్తేనే సాధ్యమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కొత్త బీసీ కమిషన్ నియామకం జరిగి, వారు బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం చేయడం, సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ తీర్పుపై అవగాహన ఏర్పర్చుకోవడం, నివేదిక తయారీ, సంప్రదింపులు తదితర అంశాల ప్రక్రియ పూర్తి కావడానికి నెలల సమయం పడుతుంది.
స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాల్సి ఉన్నందున ప్రస్తుతం ఉన్న కమిషన్ గడువును పొడిగించడమే ఉత్తమమని నిపుణు లు సూచిస్తున్నారు. ప్రస్తుత కమిషన్ ద్వారా ట్రిపుల్ టెస్ట్ నివేదిక తెప్పించుకొని వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని బీసీ సం ఘాలు డిమాండ్ చేస్తున్నాయి. త్వరగా ఎన్నికలు నిర్వహించి పాలనను గాడిలో పెట్టాలని మాజీ ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. వెంటనే ఎన్నికలు నిర్వహించి, కేం ద్రం నుంచి నిధులను సాధించుకొని స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని సూచిస్తున్నారు.
ప్రస్తుత బీసీ కమిషన్ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై ఇతర రాష్ర్టాల్లో పర్యటించిన ఆయాచోట్ల చేపట్టిన విధానాలు, ఎదురైన అనుభవాలు, ఇబ్బందులను తెలుసుకొన్నది. ఆయా రాష్ర్టాల బీసీ కమిషన్లు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతోనూ భేటీ అయి, వివిధ అంశాలను అధ్యయనం చేసింది. రాష్ట్రంలోనూ వివిధ బీసీ కుల సంఘాల నేతలతోనూ సమావేశమైంది. బీసీ సామాజిక వర్గాలకు చెందిన మేధావులు, ఉన్నత విద్యావంతులు, వివిధ శాఖల అధికారులతో అనేక సమావేశాలు నిర్వహించింది. రాష్ట్రంలో ట్రిపుల్ టెస్ట్ నిర్వహించడానికి సన్నాహాలనూ పూర్తి చేసింది. సమగ్ర అవగాహనతో ప్రస్తుత కమిషన్ సిద్ధంగా ఉన్నది.
ఈ కమిషన్ ట్రిపుల్ టెస్ట్ నివేదిక ఇవ్వడానికే కనీసం రెండు నెలల సమయం పడుతుందని, ఆ తర్వాత దానిని ప్రభుత్వం ఆమోదించడం, సుప్రీంకోర్టుకు ని వేదించడం, తదితర ప్రక్రియ పూర్తి కావడాని కి మరికొంత సమయం పడుతుంది. అయితే ఈ నెలాఖరుతో ప్రస్తుత కమిషన్ గడువు ము గియనున్నది. ప్రభుత్వం కొత్త బీసీ కమిషన్ను నియమిస్తే కొన్ని నెలల సమయం పడుతుందని, దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో అసాధ్యమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
జడ్పీ, మండల పరిషత్ పాలకవర్గాల పదవీకాలం ఇప్పటికే ముగిసింది. ఫిబ్రవరిలోనే పంచాయతీల పాలకవర్గం సమయం ముగిసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర ఆర్థిక సంఘం రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధులను ఇప్పటికే నిలిపివేసింది. కొత్త కమిషన్ వేస్తే ఇంకా ఆలస్యమై ఇప్పట్లో నిధులు రావడం కష్టమేనని నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతమున్న కమిషన్ గడువును మరికొంత కాలం పొడిగించి వెంటనే నివేదిక తెప్పించుకొని ఎన్నికలు నిర్వహించాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.