హైదరాబాద్ : ఆత్మన్యూనతను వదిలి ఆత్మాభిమానంతో బతికే దిశగా బీసీ వర్గాలలో సీఎం కేసీఆర్ ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తున్నారని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. కుల భవనాల నిమిత్తం వేలాది కోట్ల విలువ చేసే ఖరీదైన స్థలాలను ఉచితంగా కేటాయించి, నిర్మాణాలకు కూడా కోట్ల రూపాయలు మంజూరు చేయటం సీఎం కేసీఆర్ సామాజిక, న్యాయ దృక్పథానికి నిదర్శనమని పేర్కొన్నారు.
సోమవారం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం గ్రామ పరిధిలో నాయీ బ్రాహ్మణ కులస్తులకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల స్థలంలో ఆత్మగౌరవ భవనం కోసం భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిపాలకుడికి సమాజం పట్ల దార్శనికత ఉంటే ప్రజలు గొప్పగా జీవించగలుగుతారన్నారు.
సీఎం కేసీఆర్ సామాజిక న్యాయ దృష్టితో చేస్తున్న కృషి గొప్పదని ప్రశంసించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను రూపొందించి తెలంగాణలో అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. బీసీలు సంఘటితంగా ఉంటూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిలోకి రావాలన్నారు.