హైదరాబాద్/హిమాయత్‌నగర్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం జనగణనతోపాటు బీసీ కులగణన కూడా చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, కాసన శంకర్రావు డిమాండ్ చేశారు. సోమవారం తెలుగు రాష్ర్టాల బీసీ నేతలు ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా నిర్వహించారు. కేంద్రం వెంటనే బీసీగణన చేపట్టాలని, లేదంటే రాబోయే ఎన్నికల్లో బీసీల తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. ధర్నాలో సీపీఐ, టీడీపీ, కాంగ్రెస్‌తోపాటు పలు పార్టీల నేతలు పాల్గొని మద్దతు తెలిపారు.
20 నుంచి 23 వరకు జంతర్‌మంతర్ వద్ద ధర్నా
దేశంలో బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20 నుంచి 23 వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్‌గౌడ్ తెలిపారు. సోమవారం హైదర్‌గూడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లకు పార్లమెంట్లో బిల్లు పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కులగణన చేసి జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని కోరారు.