చిక్కడపల్లి, డిసెంబర్ 10 : ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లు పెట్టి వెంటనే షెడ్యూల్లో చేర్చాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ చిక్కడపల్లిలోని బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్‌రాజ్ గౌడ్, వైస్ చైర్మన్ దుర్గయ్యగౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్నగౌడ్లు మాట్లాడారు. సమావేశాలు ప్రారంభమై నేటికి 10రోజులు కావస్తున్నా 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుపై తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు ఎందుకు నోరు మెదపడం లేదని వారు ప్రశ్నించారు.
42 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి బీసీలను మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి రెండేండ్ల విజయోత్సవాలు, తెలంగాణ రైజింగ్ సమ్మిట్ మీద ఉన్న శ్రద్ధ బీసీ రిజర్వేషన్లపై ఎందుకు లేదని ఫ్రంట్ నేతలు ప్రశ్నించారు. సమావేశంలో బైరు శేఖర్, ఎలికట్టె విజయ్‌కుమార్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్, బోయ సంఘం అధ్యక్షుడు బోయ గోపి, బడేసాబ్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు సురేశ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.