కాచిగూడ, డిసెంబర్ 11: అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లివ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం కాచిగూడలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. జనగణనలో కులగణన చేపట్టాలని కోరారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బీసీల పట్ల అవలంబిస్తున్న వ్యతిరేక వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రధాని మోదీ సంపన్న వర్గాలకే అండగా నిలుస్తున్నారని, ప్రధాని బీసీ అయిఉండి బీసీలకే అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కులగణన కోసం బీజేపీ సీనియర్ బీసీ నాయకులు ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై ఒత్తిడితేవాలని కోరారు. కేంద్రం తీరు మార్చుకోకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, రామకోటి, సతీశ్, చరణ్యాదవ్, కృష్ణయాదవ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.