హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: చట్టబద్ధత లేకుండా బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు అసాధ్యమని పలువురు వక్తలు పేర్కొన్నారు. రిజర్వేషన్ల హామీని అమలు చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనే ప్రయత్నం బీసీలను మోసం చేయడమేనని మండిపడ్డారు. బీసీ సంఘాల ఐక్యవేదిక మహాసభను హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించారు. వేదిక అధ్యక్షుడు కాటం నరసింహయాదవ్ అధ్యక్షతన కొనసాగిన సమావేశంలో బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్, బీసీ సంఘాల నేతలు వినోద్‌యాదవ్, వెంకటేశ్‌గౌడ్, రుక్మిణి, రేణుక, బీజేపీ అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయబద్ధంగా, గణాంకాలు బలంగా లేకుండా రిజర్వేషన్లు అమలుచేయడం అన్యాయమేనని స్పష్టంచేశారు.
ప్రజాస్వామ్య పద్ధతులు పాటించి, కమిషన్ నివేదికలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పరిధిలో పరిషరించాల్సిన అంశాలను పకనపెట్టి కేంద్రంపై విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. బిల్లుల ఆమోదానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపలేదని, ఇకనైనా ప్రభుత్వం రాష్ట్రపతిని కలిసేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని పంపాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఇచ్చిన గడువును ఎన్నికల షెడ్యూల్‌గా కాకుండా, కోర్టులో లార్జర్ బెంచ్‌ను ఆశ్రయించి మరింత సమయం కోరాలని, కులగణన గణాంకాలను కులాల వారీగా బహిర్గతం చేయాలని, బూసాని కమిషన్ గ్రామీణ స్థానిక సంస్థలపై మాత్రమే నివేదిక ఇచ్చిందని, పట్టణ గణాంకాలపై ఇంకా నివేదిక లేదని, అయినా బిల్లులో రెండింటినీ కలిపి 42% రిజర్వేషన్ ప్రకటించడం సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్‌కు విరుద్ధమని తెలిపారు. హామీ అమలు కాకుండా ఎన్నికలు జరిపితే, అది మోసమేనని పేర్కొన్నారు.