సంపూర్ణం కాని సర్వే.. సమగ్రం అవుతుందా? వందశాతం పూర్తికాకుండానే నివేదికకు సంపూర్ణత సిద్ధిస్తుందా? కులగణన నివేదిక విషయంలోమాత్రం ప్రభుత్వం అదే చెప్తున్నది. అలాగే చేస్తున్నది. ఇంటింటి సర్వే పూర్తికాకుండానే కులగణన నివేదిక సిద్ధమైపోయింది. 1.03 లక్షల ఇండ్లు తలుపులు వేసి ఉండడం, 1.68 లక్షల కుటుంబాలు సర్వేలో పాల్గొనడానికి సంకోచించడం, 84,137 ఇండ్లు నివాసేతరంగా ఉండటం వంటి సమస్యలతో 3.1 లక్షల కుటుంబాల వివరాలను, మొత్తంగా 16 లక్షల జనాభా వివరాలను సేకరించలేదని ప్రభుత్వమే చెప్తున్నది. మరి అసమగ్ర సర్వేను పట్టుకొని తుది నివేదిక ఎలా ఇస్తారని ఇప్పుడు బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇలాంటి తప్పులతడక నివేదికను సర్కారు ఆమోదిస్తే.. అంతిమంగా బీసీ వర్గాలకు అన్యాయం చేసినట్టే అవుతుందని హెచ్చరిస్తున్నారు.
Caste Census | హైదరాబాద్, ఫిబ్రవరి2 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఇంటింటి సర్వే గణాంకాలపై సామాజికవేత్తలు, బీసీ సంఘాల నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 96.9 శాతం సర్వే పూర్తిచేశామని, 3.1 కుటుంబాల వివరాలను సేకరించలేదని చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే మొత్తం తప్పులతడకగా కొనసాగిందని నిప్పులు చెరుగుతున్నారు. ఎన్యుమరేటర్లు అరకొర సమాచారాన్నే సేకరించారని, శాస్త్రీయత లేకుండా చేశారని, పకడ్బందీగా నిర్వహించలేదని, కచ్చితమైన లెక్కలు వచ్చే అవకాశమే లేదని చెప్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి మరోసారి వివరాలు సేకరించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, కుల)ను నవంబర్ 6 నుంచి ప్రారంభించింది. ఇండ్ల స్టిక్కరింగ్ మొదలు, సర్వే మొత్తం తప్పుల తడకగా ఉన్నదని సామాజిక వేత్తలు, కులసంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సర్వే చేయాల్సిన ఇండ్లను గుర్తించి, స్టిక్కర్లు వేశారు. ఈ క్రమంలోనే అనేక మంది గృహ యజమానులు విముఖత చూపారు.
స్టిక్కరింగ్ చేసేందుకు అంగీకరించలేదు. దీంతో ఎన్యుమరేటర్లు సైతం చేసేదేమీలేక ఆయా ఇండ్లను మినహాయించారు. ప్రభుత్వం సైతం 1.03 లక్షల ఇండ్లు తలుపులు వేసి ఉండడం, 1.68 లక్షల కుటుంబాలు సర్వేలో పాల్గొనడానికి సంకోచించడం, 84,137 ఇండ్లు నివాసేతరంగా ఉండటం వంటి సమస్యలతో 3.1 లక్షల కుటుంబాల వివరాలను, మొత్తంగా 16 లక్షల జనాభా వివరాలను సేకరించలేదని తాజాగా ప్రకటించింది. కానీ రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఇండ్లను ఇదే రీతిలో మినహాయించారని సామాజికవేత్తలు వెల్లడిస్తున్నారు. స్టిక్కరింగ్ చేసిన ఇండ్లకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా సేకరించలేదని చెప్తున్నారు.
ఇక పట్టణాల్లోనైతే పరిస్థితి మరీ దారుణంగా ఉందని, స్లమ్ ఏరియాలు మినహా మిగతా ప్రాంతాల్లో సర్వే 30 శాతానికి మించి కొనసాగలేదని, అర్బన్‌లో అనేక మంది గృహ యజమానులు స్టిక్కరింగ్కే అంగీకరించలేదని, చేయించుకున్నవారు కూడా వివరాలను వెల్లడించేందుకు ముందుకురాలేదని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఇండ్లు సర్వేలో లేకుండానే పోయాయని ఘంటాపథంగా చెప్తున్నారు. ప్రజలందరి వివరాలను సేకరించే ప్రయత్నం చేయకుండానే 96.9 శాతం సర్వే నిర్వహించామని చెప్తూ గణాంకాలను వెల్లడించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.
కచ్చితమైన లెక్కలు తీయాలంటే ఇప్పటికే అందుబాటులో ఉన్న గణాంకాలతో క్షేత్రస్థాయిలో తులనాత్మక అధ్యయనం చేయాల్సి ఉంటుందని, అదే సమయంలో కొత్త కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేస్తే సరిపోయేదని బీసీ మేధావులు వివరిస్తున్నారు. ప్రభుత్వం అందుకువిరుద్ధంగా ఇంటింటి సర్వే చేసిందని వెల్లడిస్తున్నారు. గృహ యజమానులు చెప్పిన సమాచారాన్నే ఎన్యుమరేటర్లు నమోదు చేశారని, అది వాస్తవమా? కాదా? అన్న పరిశీలనకు ఎక్కడా అవకాశం లేకుండా పోయిందని వివరిస్తున్నారు. కులాలవారీగా వెల్లడించిన లెక్కలపై అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
సర్వేలో పాల్లొన్నవారిలో చాలా మంది గృహ యజమానులు ఆస్తులు, ఆదాయ వివరాలను వెల్లడించేందుకు విముఖత చూపారని, వెరసి అరకొరగానే సమాచారం సేకరించారని వివరిస్తున్నారు. కొన్ని ఇండ్లను గణించి, కొన్నింటిని గణించకపోవడం, కొందరి వివరాలు సేకరించి, చాలామందిని వదిలేయడం వల్ల సమగ్ర సర్వే ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. అరకొరగా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి రూపొందించే గణాంకాలు క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రతిబింబించబోవని స్పష్టం చేస్తున్నారు. సేకరించిన డాటా కచ్చితత్వం, ప్రామాణికతపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా సర్వే ఉద్దేశం నెరవేరడమే ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్తున్నారు. బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ, ఇంటింటి సర్వేపై రేవంత్ సర్కారు ఆది నుంచీ ఇష్టానుసారంగా వ్యవహరించిందని, ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ముందుకు పోయిందని నిప్పులు చెరుగుతున్నారు.
నగరంలో 40 శాతం కూడా కుల సర్వే సమగ్రంగా జరగలేదని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు మండిపడ్డారు. అసమగ్రంగా సేకరించిన సమాచారంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తే, తకువ సీట్లు వచ్చే ప్రమాదముందని తెలిపారు. వెంటనే నగరంలో పూర్తిస్థాయి సామాజిక కుల సర్వే చేపట్టాలని, అందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముందుకు రాకపోవడంపై నిప్పులు చెరిగారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం బీసీలను నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు చ ర్యలను మానుకోవాలని, బీసీ సం ఘాలు, మేధావులతో సీఎం రేవంత్ సమావేశం ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశా రు. రేవంత్‌కు బహిరంగ లేఖ విడుద ల చేశారు. కులగణన లెకలను కమిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని, ఇప్పుడు మంత్రివర్గ ఉప సం ఘం అంటూ హడావుడి చేస్తూ గందరగోళ పరిస్థితి కల్పిస్తున్నదని మండిపడ్డారు. తొందరపాటు నిర్ణయాలు తీ సుకోవద్దని, న్యాయపరమైన చికులు రాకుండా చూడాలని సూచించారు. అఖిలపక్ష నేతలతో తక్షణమే ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.