ఖైరతాబాద్, నవంబర్ 12: ‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని హామీ ఇచ్చి మోసగించింది. ఇక తమ పోరాటం అక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం’ అని రిటైర్డ్ జస్టిస్, బీసీ ఆక్రోశ సభ ఆహ్వాన సంఘం చైర్మన్ ఈశ్వరయ్య తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించనున్న బీసీ ఆక్రోశ సభ బ్రోచర్‌ను సంఘం అధ్యక్షుడు, విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు, వైస్ చైర్మన్ విశారదన్ మహారాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజుగౌడ్తో కలిసి ఆవిష్కరించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలుచేస్తామని హామీ ఇచ్చి, జీవోల పేరిట కాలయాపనచేసి చివరకు కోర్టుస్టే విధించడంతో కేంద్రంపై భారం మోపి తప్పుకున్నదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు సాధించే అవకాశం ఉన్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయలేదని పేర్కొన్నారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించి కామారెడ్డి గడ్డపైనే బీసీ ఆక్రోశ సభ నిర్వహించి ప్రభుత్వానికి తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. ఈ సభకు బీసీలు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.