హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): కార్మిక రాజ్యం రావాలంటే సామ్రాజ్యవాదం పోవాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీబీ రాఘవులు చెప్పారు. మే డే సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఇబ్బందులు ఎదురొంటున్నాయని తెలిపారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై ఒకేసారి రూ.993 పెంచడం వల్ల దాని ప్రభావం అన్నింటిపైనా పడుతుందని చెప్పారు. కార్మిక పోరాటాలను లేబర్ కోడ్లు ఆపలేవని వెల్లడించారు. అన్యాయం, అణచివేత జరుగుతుంటే చూస్తూ ఊరుకోకుండా తిరగబడే తత్వం కార్మికవర్గానిదని పేర్కొన్నారు. మే డే దినోత్సవంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టీ జ్యోతి, టీ సాగర్ పాల్గొన్నారు.
పాలకులకు ప్రజల కంటే పెట్టుబడిదారులే ముఖ్యం ; సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్
హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): ప్రజల కంటే పెట్టుబడిదారుల ప్రయోజనాలకే పాలకులు పాటుపడుతున్నారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాసర్ పిలుపునిచ్చారు. మే డేను పురస్కరించుకొని శుక్రవారం ఆయన మాట్లాడుతూ యుద్ధాల వల్ల కార్మికవర్గం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని చెప్పారు. దేశంలో ఇంధన కొరత, పరిశ్రమలు మూతపడటం, ఉద్యోగాల కోల్పోవడం వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. మే డే అనేది 8 గంటల పని విధానాన్ని సాధించుకున్న చారిత్రాత్మక రోజు అని, ఇది ఎవరో ఇచ్చింది కాదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ల ద్వారా 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచే ప్రయత్నం జరుగుతున్నదని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్మిక, రైతు, ప్రజా విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.