Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 2(నమస్తే తెలంగాణ): సైకిల్ పెట్రోలింగ్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీస్స్టేషన్లకు అప్పగించిన బ్యాటరీ సైకిళ్లు, హెల్మెట్లు కనిపించడం లేదు. ఆ సైకిళ్లు ఎక్కడున్నాయి? దొంగలు అపహరించారా? సిబ్బంది చేతివాటం ప్రదర్శించారా? అనేది ప్రస్తుతం సిటీ పోలీసుల్లో చర్చనీయాంశంగా మారింది. పెట్రోలింగ్ వ్యవస్థ పటిష్టతకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 130కిపైగా సైకిళ్లు వివిధ పోలీస్స్టేషన్లకు పంపిణీ చేశారు. ఒక్కో సైకిల్‌కు హెల్మెట్, ఫస్ట్ ఎయిడ్ కిట్, మ్యాన్ఫ్యాక్, లాఠీ, సైరన్, ఎల్ఈడీ లైట్, వాటర్ బాటిళ్లతో కూడిన కిట్‌ను కూడా అందజేశారు.
కార్లు వెళ్ల ని ప్రాంతాల్లో సిబ్బంది బైకులు, సైకిళ్ల మీదుగా వెళ్లి బస్తీ, గల్లీలో పెట్రోలింగ్ నిర్వహించారు. సౌత్‌జోన్‌లోని ఠాణాలకు 13, సెంట్రల్ 24, వెస్ట్‌జోన్ 20, ట్రాఫిక్ ఠాణాలకు 50, ఎస్బీకి 19, సీపీ కార్యాలయానికి 9 సైకిళ్లను అందజేశారు. ఆ తర్వాత చైనా నుంచి కూడా సైకిళ్లను తెచ్చి సిబ్బందికి ఇవ్వగా, కొన్ని పాడైపోయాయి. ప్రభుత్వం మారింది, అధికారులు మారుతూ వచ్చారు. ఆ క్రమంలోనే చాలా సైకిళ్లు ఠాణాల నుంచి మాయమవుతూ వచ్చాయి. సైకిళ్లు పనిచేయకపోతే సిటీ ఆర్మూడ్ రిజర్వు ఫోర్స్(కార్) హెడ్ క్వార్టర్స్‌కు తరలిస్తుంటారు. తుక్కుగా అమ్మేశారా? అనే విషయం కూడా లెక్కల్లో లేదని సమాచారం.
సైకిళ్ల మాయంపై ఆరా…!
సైకిళ్లు మాయమవుతున్నాయనే విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఎన్ని సైకిళ్లు పీఎస్‌లో ఉన్నాయి? అవి ఎక్కడికి పోయాయి? అనే విషయాన్ని తెలుసుకుంటు న్నారు. కార్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ రక్షిత మూర్తి ని వివరణ కోరగా సైకిళ్లు ఎక్కడెక్కడున్నాయ నే విషయంపై ఆరా తీస్తున్నామని తెలిపారు.