డిచ్పల్లి/లక్ష్మీదేవిపల్లి, అక్టోబర్ 28 : ఏక్ పోలీస్ విధానం అమలు కోసం ఆందోళన చేసిన కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ ఎత్తివేసేదాకా పోరాటం ఆపేదిలేదని బెటాలియన్ కానిస్టేబుళ్లు స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని ఏడో బెటాలియన్‌లో సోమవారం కానిస్టేబుళ్లు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 39 మందిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇన్చార్జి కమాండెంట్ ఎంఐ సురేశ్‌కు వినతిపత్రం అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని చాతకొండ 6వ బెటాలియన్ వద్ద ఏఈఆర్ పోలీసులు సోమవారం మూడో రోజు విధులకు హాజరుకాకుండా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బెటాలియన్ కానిస్టేబుళ్లు మాట్లాడుతూ అందరికీ ఒకే రూల్ విధానంపై సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట తప్పారని ఆరోపించారు.