Bathukamma | ఎర్రుపాలెం, అక్టోబర్ 3: ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ప్రజల్లో సమైక్యతను తీసుకొచ్చింది. సాంస్కృతిక పునరుజ్జీవనానికి వేదికగా నిలిచింది. ఊరూరా ఉద్యమ పాటలతో బతుకమ్మ ఆడుతూ నాడు ప్రజలు ఉత్తేజితులయ్యారు. ఊరూవాడా ఏకమై సింగిడి పూలతో పునరుత్తేజితులై ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మకు ప్రపంచ ఖ్యాతినే తీసుకొచ్చారు. రాష్ట్ర పండుగగా గుర్తించి, ప్రత్యేక నిధులు కేటాయించి, ఏటా బతుకమ్మ చీరలు ఇస్తూ మహిళలను బతుకమ్మలుగా కొలిచేలా గుర్తింపుతెచ్చారు. కానీ, నేటి కాంగ్రెస్ సర్కారు బతుకమ్మకే అవమానం కలిగిస్తున్నది. దానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇలాకాలోని బీమవరంలో జరిగిన ఘోర అవమానమే దానికి నిదర్శనం. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం భీమవరంలో బతుకమ్మ ఆడేందుకు కాంగ్రెస్ నేతల హుకుంతో అధికారులు, సిబ్బంది ఆటంకం కల్పించారు. గ్రామంలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడి సహకారం, ఎన్ఆర్ఐల తోడ్పాటుతో గతంలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని నిర్మించారు. దాని ఆవరణలో మహిళలంతా ఏటా బతుకమ్మ పండుగ సంబురాలు జరుపుకుంటారు.
బీఆర్ఎస్ వర్గీయులు పంచాయతీ కార్యాలయంలో బతుకమ్మ ఆడుకునేందుకు సిద్ధమైన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు దుష్టపన్నాగంతో ఎంపీడీవో దారా కార్యదర్శి మురళికి పలు ఆదేశాలు జారీచేయించారు. ‘అధికారుల అనుమతి లేకుండా కార్యాలయంలో ఎటువంటి కార్యక్రమాలు, ఉత్సవాలు జరపకూడదు’ అంటూ బోర్డులో నోటీసు ఉంచారు. బీఆర్ఎస్ మాజీ జడ్పీటీసీ శీలం కవిత, పలువురు గ్రామ మహిళలు దీనిని ప్రశ్నించారు. గురువారం ఖమ్మం వెళ్లి కలెక్టర్‌ను కలవగా, అనుమతించారు. ఈ మేరకు గురువారం రాత్రి స్థానిక మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలతో అక్కడికి బయలుదేరారు. ఆఫీసు వద్ద ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్‌ను అడ్డుపెట్టి అడ్డుకున్నారు. మధిర సీఐ మధు అక్కడికి చేరుకొని వేరేచోట బతుకమ్మ ఆడుకోవాలని సూచించారు. దీంతో చేసేదేమీలేక గ్రామ మహిళలందరూ రోడ్డుపక్కనే బతుకమ్మ ఆడుకున్నారు.