Congress | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 10 ( నమస్తే తెలంగాణ ): మూసీ పరివాహక ప్రాంత ప్రజలు హైడ్రా, సీఎం రేవంత్‌రెడ్డిపై తమ ఆక్రోశాన్ని బతుకమ్మ ఆడుతూ వెళ్లగక్కారు. ‘కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. గూడు కూల్చింది ఉయ్యాలో…’ అంటూ సీఎం రేవంత్ సర్కార్‌కు వ్యతిరేకంగా మూసీ పరీవాహక ప్రాంతాల్లో బతుకమ్మ పాటలతో మహిళలు గొంతెత్తారు. చప్పట్లు కొడుతూ కాంగ్రెస్ సర్కార్‌కు పోయేకాలం వచ్చిందని హెచ్చరించారు.నాగోల్, రామాంతపూర్, చైతన్యపురి, సైదాబాద్, అంబర్‌పేట మూసీ ప్రాంతాల్లో మహిళలు బతుకమ్మ ఆడుతూ కూల్చివేతలు, రేవంత్‌రెడ్డి పాలనకి వ్యతిరేకంగా బతుకమ్మ ఆడారు.
ఈ పాటలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో…‘గుంపు మేస్త్రీ పాలన ఉయ్యాలో.. గుదిబండ తీరాయే ఉయ్యాలో.. పేదల బతుకుల్లో ఉయ్యాలో.. చీకటి నింపిండు ఉయ్యాలో.. గూడు చెదిరిపాయే ఉయ్యాలో.. గుండెలవిసిపాయే ఉయ్యాలో.. కాంగ్రెస్ రేవంత్ ఉయ్యాలో.. కాలయముడైపాయే ఉయ్యాలో..’ అంటూ నిరసన వ్యక్తం చేశారు. ‘మా ఇండ్లు కూల్చిండ్రే బతుకమ్మ.. మా నోట్లో మన్నేసే బతుకమ్మ.. ఇల్లంటే అమ్మలానే బతుకమ్మ.. అమ్మలేని పిల్లలమైనామే..’ అంటూ నిరసన వ్యక్తం చేశారు. ‘రేవంత్ సారూ ఉయ్యాలో.. నీ జాగల నువ్వు ఉండు ఉయ్యాలో.. మా ఇండ్ల మమ్మల్నీ ఉండనియ్యవయ్య ఉయ్యాలో..’ అంటూ మహిళలు పదం కదుపుతూ నిరసన వ్యక్తం చేశారు.