రాచరికపు పోకడలకు గుర్తులంటూ అధికారిక చిహ్నం నుంచి తొలగిస్తానన్న కాకతీయ కళాతోరణం, చార్మినార్‌తో పాటు కేసీఆర్ నిర్మించిన సెక్రటేరియట్, యాదాద్రి టెంపుల్, టీ హబ్, కమాండ్ కంట్రోల్ సెంటర్, బుద్ధవనాన్నే అందాల పోటీల కంటెస్టెంట్లకు చూపించారు. నాడు నిజాం, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఆనవాళ్లే సుందరాంగులకు చూపించేందుకు దిక్కయ్యాయి.
హైదరాబాద్ మే 26 (నమస్తే తెలంగాణ) : ‘ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని అభయ హస్తం.. హస్తం పార్టీని నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట మునిగినం’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అంటే నీళ్లు, నిధులు, నియామకాలైతే కాంగ్రెస్ అంటే నిందలు, దందాలు, చందాలు అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మన ముఖ్యమంత్రి రేవంత్ మోసగాళ్లకే మోసగాడు.. నాడు చంద్రబాబు కోసం బ్యాగులు మోసిండు. నేడు రాహుల్ కోసం మూటలు మో స్తున్నడు’ అంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ‘నడిగడ్డలో ఉప ఎన్నికలు రావడం.. మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయం.. ఇందుకు ఇక్కడికొచ్చిన కార్యకర్తల ఉత్సాహమే నిదర్శనం’ అని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మారిన నేతకు కర్రుకాల్చి వాతపెట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణ భవన్లో గద్వాల కాంగ్రెస్ ముఖ్య నేత బాసోజు హన్మంతునాయుడు ఆధ్వర్యం లో పెద్ద సంఖ్యలో ఆ పార్టీ మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ముఖ్యనేతలు బీఆర్ఎస్లో చేరారు.
మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ముఖ్య నేతలు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ నేతలు తుల ఉమ, కురవ విజయ్, కార్తీక్ రెడ్డితో కలిసి కేటీఆర్ వీరికి గులాబీ కండువా లు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం గద్వాల బీఆర్ఎస్ నేత ఆంజనేయులుగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ పాలన వైఫల్యాలు ఎండగడుతూ నే కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. నీళ్లివ్వకుండా, అభివృద్ధి చేయకుండా 55 ఏళ్లు గోస పెట్టిన పార్టీని ఆశలకు పోయి ఎన్నుకుంటే అసలుకే మోసం వచ్చిందని పేర్కొన్నారు. ఆరుగ్యారెంటీలకు ఎగనామం పెట్టి ప్రజలకు పంగనామాలు పెట్టిందని దుయ్యబట్టారు. కుండ పగిలినప్పుడే కుక్క బుద్ధి తెలిసినట్టు, పార్టీ మారిన వక్రబుద్ధి నేతలకు ఓటుతో గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్ గెలిచిన రెండే రెండు సీట్లు నడిగడ్డలోనేనని, ఈ విజయాలను చూస్తుంటేనే అక్కడి కార్యకర్తల పోరాట పటిమ తెలిసిపోతుందని కొనియాడారు.
సోమవారం తెలంగాణభవన్‌లో గద్వాల జిల్లా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కరెంట్ కష్టాలపై ప్రజలు కన్నెర్ర జేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఏడాదిన్నరలో అన్ని రంగాలను కుదే లు చేసిన హస్తం పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నారని చెప్పా రు. ‘ఈ రోజు మాజీ హోంమంత్రి మహమూద్ అలీని పరామర్శించేందుకు ఓ దవాఖానకు వెళ్లినప్పు డు నూర్ఫాతిమా అనే మహిళ తన చెయ్యి పట్టుకొని కేసీఆర్ టైంల నిమిషం కూడా కరెంట్ పోలేదని.. ఇప్పుడు గంటగంటకు పోతున్నదని, గిట్లయితే మేం బతుకలేమని, ఈ ముఖ్యమంత్రిని పడగొట్టే ఉపాయం చేయమన్నది’ అని వివరించారు.
ముఖ్యమంత్రి మాటలు వింటే ఆయన మానసిక స్థితిపై అనుమానం కలుగుతున్నదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆయనలో రాము, రెమో ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘రాష్ట్రం దివాలా తీసిందని..తెలంగాణకు ఎవరూ అప్పు ఇవ్వడంలేదని, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోయే వాళ్లలా చూస్తున్నారని రెమోలా.. మళ్లా తెల్లారే రాష్ట్రాభివృద్ధికి రూ. 1.58లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చానని రాములా’ మాట్లాడడం ఆయనకే చెల్లిందని విమర్శించారు. వాస్తవానికి దివాలా తీసింది రాష్ట్రం కాదని..కాంగ్రెస్ నాయకుల మెదళ్లని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి పాలన చేతగాక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ‘ఉద్యోగులు పీఆర్సీ, డీఏలు అడిగితే తనను కోసుకుతినండి’ అని బెదిరించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. పెండ్లి చేసుకున్న ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వకుండా మొండి చెయ్యి చూపారని విమర్శించారు.
నడిగడ్డ అంటే కేసీఆర్‌కు వల్లమాలిన అభిమానమని కేటీఆర్ అన్నారు. వెనుకబడిన ఇక్కడి ప్రజల గోస తీర్చేందుకు నిరంతరం శ్రమించారని చెప్పారు. వలసలకు చిరునామాగా ఉన్న పాలమూరు జిల్లాను నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించి సస్యశ్యామలం చేశారని గుర్తుచేశారు. ఉమ్మడి పాలనలో ఏటా 14 లక్షల మంది వలసవెళ్లేవారని, కానీ కేసీఆర్ పాలనలో వాపస్ రావడమే కాకుండా రాయ్‌చూర్, కర్నూలు నుంచి పత్తి ఏరేందుకు రివర్స్ వలసలు వచ్చేపరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. కానీ హస్తం పార్టీ పాలనలో మళ్లీ పూర్వపు పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిన్నర దాటినా ఒక్క ప్రాజెక్టు కట్టలేదని, ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేదని పేర్కొన్నారు. కేసీఆర్ ఉద్యమ సమయంలో రాజోలిబండ డైవర్షన్ స్కీం సాధనకు పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. దండం పెట్టకుండానే, దరఖాస్తు ఇవ్వకుండానే కొత్త జిల్లాను ఏర్పాటు చేయడమే గాకుండా అన్ని హంగులతో కలెక్టరేట్ నిర్మించారని కేటీఆర్ పేర్కొన్నారు.
‘మింగమెతుకు లేదుగానీ మీసాలకు సంపెంగ నూనె’ చందంగా సీఎం రేవంత్‌రెడ్డి అందాల పోటీల పేరిట ఆర్భాటాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాచరికపు పోకడలకు గుర్తులంటూ అధికారిక చిహ్నం నుంచి తొలగిస్తానన్న కాకతీయ కళాతోరణం, చార్మినార్‌తో పాటు కేసీఆర్ నిర్మించిన సెక్రటేరియట్, యాదాద్రి టెంపుల్, టీ హబ్, కమాండ్ కంట్రోల్ సెంటర్, బుద్ధవనాన్ని చూపించి మురిపించారని ఎద్దేవా చేశారు. నాడు నిజాం, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఆనవాళ్లే సుందరాంగులకు చూపించేందుకు దిక్కయ్యాయని దెప్పిపొడిచారు.
రేవంత్ మానసిక స్థితిపై అనుమానం కలుగుతున్నది. రాష్ట్రం దివాలా తీసిందని.. తెలంగాణకు ఎవరూ అప్పు ఇవ్వడంలేదని, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోయే వాళ్లలా చూస్తున్నారని రెమోలా.. మళ్లా తెల్లారే రాష్ట్రాభివృద్ధికి రూ. 1.58 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చానని రాములా మాట్లాడుతున్నారు.
-కేటీఆర్
నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలని కేటీఆర్ సూచించారు. ఈ ఏడాది పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టిపెట్టనున్నామని పేర్కొన్నారు. జూన్ మొదటి వారంలో సభ్యత్వ నమోదు ప్రారంభిస్తామని తెలిపారు. నడిగడ్డతో పాటు రాష్ట్రంలోని పార్టీ శ్రేణులు కదనోత్సాహంతో సభ్యత్వ నమోదు చేయించాలని కోరారు. ఈ విషయంలో ఏ ఒక్కరూ నిర్లక్ష్యం చూపవద్దని హితబోధ చేశారు. కార్యక్రమంలో నాయకులు నెక్కంటి శ్రీనివాస్, కిషోర్‌గౌడ్, గెల్లు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
గద్వాల జిల్లాకు చెందిన కాంగ్రెస్ ముఖ్యనేతలు హన్మంతునాయుడు, రాఘవరెడ్డి, రాంరెడ్డి, చక్రధర్‌రెడ్డి, బాస శ్యామల, శ్రీనివాస్‌రెడ్డి తదితర ముఖ్య నేతలతో పాటు మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు వందలమంది గులాబీ కండువా కప్పుకున్నారు. వీరి చేరికలతో పార్టీలో జోష్ కనిపించింది. కార్యక్రమానికి పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలిరావడం, నేతల ప్రసంగానికి అడుగడుగునా చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ స్పందించడం కనిపించింది.
రైతుబంధు పెంచుతామని, రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ రైతాంగానికి హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ అసలుకే మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. ‘చారణా కోడికి బారాణా’ మసాల చందంగా సాగదీసి సాగదీసి నాలుగోవంతే మాఫీ చేసినట్టేట ముంచిందని ధ్వజమెత్తారు. ‘మొదట బ్యాంకర్ల సమావేశంలో రూ. 49,500 కోట్లు, తెల్లారే సీఎం నోట రూ. 40,000 కోట్లు, ఆ తర్వాత నాలుగురోజులకు నిర్వహించిన క్యాబినెట్ భేటీలో రూ. 31, 000 కోట్లు, బడ్జెట్లో రూ. 26,000 కోట్లు.. చివరకు చేసింది రూ. 11,000 వేల కోట్లే’ అని విమర్శించారు. రెండు విడతలు రైతుబంధు ఎగ్గొట్టి దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ అంటే నిధులు, నీళ్లు నియామకాలైతే కాంగ్రెస్ అంటే నిందలు, దందాలు, చందాలు.
– కేటీఆర్
నడిగడ్డ ప్రజల నరనరాల్లో కేసీఆర్ ఉంటారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. అందుకే ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోయినా రెండు నదుల మధ్యగల ఈ ప్రాంతంలో పదిలంగా ఉన్నదని చెప్పారు. ఉద్యమ సమయంలో ఇక్కడి ప్రజలు కొదమసింహాల్లా కేసీఆర్ ర్యాలీలో పాల్గొన్నారని గుర్తుచేశారు. ‘కాంగ్రెస్ అంటే అబద్ధం.. బీఆర్ఎస్ అంటే నిజం.. ఒకటి తెలంగాణ ప్రజల గుండెల్లో గునపాలు దింపిన పార్టీ అయితే.. మరొకటి తెలంగాణ తెచ్చిన పార్టీ’ అని ఉద్ఘాటించారు. ఏదిఏమైనా గద్వాల పట్టణంలో బండ్ల కూలిపోవడం మొదలైందని వ్యాఖ్యానించారు. పార్టీ మారిన బండ్ల కృష్ణమోహన్‌కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బంగ్లా రాజకీయాలకు చరమగీతం పాడాలని సూచించారు.
బండ్ల బంగ్లాను బద్దలు కొట్టేందుకు వేలాది గా తరలివచ్చిన అన్నలకు హృదయపూర్వక ధన్యవాదాలు. నడిగడ్డలోని ప్రతి ఒక్కరి గుండె ల్లో కేసీఆర్ ఉన్నరు. బర్త్‌డే సందర్భంగా రోగులకు పండ్లు పంచిపెట్టేందుకు హాస్పిటళ్లకు వెళ్తే ఆయననే గుర్తుచేసుకుంటున్నరు. రెండు వేల పింఛన్, రైతుబంధు ఇచ్చిన్రని తలుచుకుంటున్నరు. గద్వాల నియోజకవర్గం నుంచి బండ్ల కృష్ణమోహన్‌కు పార్టీ మూడుసార్లు బీఫాం ఇస్తే రెండుసార్లు గెలిపించుకున్నం. కానీ ఆయన సొంత లాభం కోసం కన్నతల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచి అవతల పార్టీలోకి వెళ్లిపోయిండు.. పోయినోడు పోయినట్టు ఉన్నడా అంటే అదీలేదు.. కాంగ్రెస్ చేసే అన్ని కార్యక్రమా ల్లో పాల్గొంటున్నడు.. ఇంతకి ఆయన ఏ పార్టీలో ఉన్నరో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి వాళ్లకు బుద్ధిచెప్పాలంటే మనమందరం ఏకం కావాలె. ఎన్నిక ఏదైనా నడిగడ్డపై మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే.
పదవులు అనుభవించి, లబ్ధిపొంది పార్టీ మారిన నాయకులను మళ్లీ ఎట్టిపరిస్థితుల్లో నూ చేర్చుకోబోమని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తేల్చిచెప్పారు. కష్టకాలంలో ఉన్నవారినే భవిష్యత్తులో ఆదరిస్తామని, అండగా నిలుస్తామని స్పష్టంచేశారు. తెలంగాణభవన్‌లో సోమవారం గద్వాల జిల్లా నాయకులు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశం లో ఆయన మాట్లాడారు. తుంగభద్ర, కృష్ణా నదుల మధ్యనున్న నడిగడ్డ నుంచే ఆనాడు కేసీఆర్ పాదయాత్ర చేపట్టారని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ఉద్యమించి తెలంగాణను సాధించారని కొనియాడారు. తెచ్చిన రాష్ట్రాన్ని పదేండ్ల పాలనలో ఎంతగానో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. ముఖ్యంగా సాగు, తాగునీరు లేక అల్లాడుతున్న నడిగడ్డ గోస తీర్చిన ఘనత ఆయనకే దక్కిందని చెప్పారు. నాడు 14 లక్షల మంది వలసపోయిన జిల్లాను సస్యశ్యామలం చేశారని కొనియాడారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలకు మోసపోయిన ప్రజలు ఇప్పుడు అరిగోస పడుతున్నారని పేర్కొన్నారు. ఏదిఏమైనా కార్యకర్తలు అధైర్యపడవద్దని కేటీఆర్ నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటదని స్పష్టం చేశారు. జెండా మోసి న వారిని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని భరోసానిచ్చారు.
ఓ వైపు వానకాలం మొదలవుతున్నా ఇంకా యాసంగి వడ్లను కొనలేని అసమర్థ ప్రభుత్వమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో కల్లా ల్లో ధాన్యం తెచ్చిన నాలుగైదు రోజుల్లోనే కొనుగోలు చేసి ఆ వెంటనే నగదు జమయ్యేదని చెప్పారు. కొనుగోళ్లు ఆలస్యం కావడంతో అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుందని అన్నారు. వడ్లు కొనాలని అడిగిన రైతులపైకి పోలీసులను పంపి చితక్కొటిస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ మాటలు నమ్మి ఓటేసిన నడిగడ్డ ప్రజలు నియ్యత్ తప్పకుండా బీఆర్ఎస్ను గెలిపించారన్నారు. ఇదే స్ఫూర్తితో గులాబీ జెండాను ముందుకుతీసుకెళ్దామని పిలుపునిచ్చారు.
కేసీఆరే మళ్లీ రావాలి.. కావాలనే స్ఫూర్తితో నడిగడ్డ నుంచి తెలంగాణ భవన్‌కు వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మీరంతా ఏకమై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుండెల్లో గునపాలు దింపాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పారు. నడిగడ్డపై గులాబీ జెండా ఎగురవేసి పార్టీ మారిన ద్రోహి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.