Basara | ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ : బాసరలోని శ్రీవేదభారతీపీఠం పాఠశాలలో తీవ్రగాయాల పాలైన విద్యార్థి లోహిత్ కేసులో కీలక సాక్షి అయిన సహచర విద్యార్థి మణికంఠ మరణం మిస్టరీగా మారింది. లోహిత్ నెత్తుటి మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా ముందుగా చూసింది మణికంఠ… లోహిత్‌కు అత్యంత సన్నిహితుడు. లోహిత్ తీవ్రగాయాల కేసులో మణికంఠకు కూడా కీలక సమాచారం తెలిసి ఉంటుందని పోలీసు అధికారులు భావించారు. మార్చి 20న తెల్లవారుజామున లోహిత్‌ను నెత్తుటి మడుగులో చూసిన మణికంఠ.. ఏప్రిల్ 4న తెల్లవారుజామున మృతిచెందాడు. మణికంఠ కరెంట్ షాక్‌తో చనిపోయాడని శ్రీవేదభారతి పీఠం పాఠశాల నిర్వాహకులు చెప్తున్నారు. కానీ, మణికంఠది ముమ్మాటికీ హత్యేనని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
లోహిత్ దవాఖానలో చికిత్స పొందుతుండగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆశ్రమానికి వెళ్లి నిర్వాహకులను, సిబ్బందిని, విద్యార్థులను విచారించారు. సాక్షులుగా ఉన్న మణికంఠ, మరో విద్యార్థి ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వేద పాఠశాల నిర్వాహకులు విద్యార్థులకు సెలవులు ఇచ్చి ఇండ్లకు పంపించారు. లోహిత్ ఘటన జరిగిన మూడు రోజులకు మణికంఠ తన తల్లిదండ్రులకు వేరే ఫోన్ నుంచి కాల్ చేసి మాట్లాడాడు. “వేద పాఠశాలలో ఓ విద్యార్థిపై దాడి జరిగింది. పిల్లలందరినీ ఇంటికి పంపించారు. నేను కూడా ఇంటికి వెళ్తానని చెప్పాను. నువ్వు ఎక్కడికీ పోవద్దు అని స్వామీజీ ఆపారు. నా సెల్‌ఫోన్‌ను పోలీసులు తీసుకున్నారు. ఫోన్ నా చేతికి వచ్చిన తర్వాత నేను ఇంటికి వస్తాను’ అని చెప్పాడని మణికంఠ తల్లిదండ్రులు తెలిపారు. ఫోన్ లేకపోయినా పర్లేదు, నువ్వు ఇంటికిరా. అక్కడ పరిస్థితి బాగోలేదు అని మణికంఠ తల్లిదండ్రులు చెప్పగా, అలాంటి విలువైన ఫోన్ మనం మళ్లీ కొనలేం. ఫోన్‌ను పోలీసులు నాకు ఇచ్చిన తర్వాత ఇంటికి వస్తాను అని మణికంఠ చెప్పాడని తల్లిదండ్రులు వెల్లడించారు.
ఏప్రిల్ 4న మధ్యాహ్నం 12 గంటలకు పాఠశాల నిర్వాహకులు మణికంఠ తల్లిదండ్రులకు ఫోన్‌చేసి, మీ కుమారుడు మనికంఠ చనిపోయాడు అని చెప్పారు. విద్యార్థులందరికీ సెలవులు ఇచ్చి, తమ కుమారుడు ఒక్కడినే పాఠశాలలోనే ఉండాలంటూ స్వామీజీ ఆపడమేంటి? హఠాత్తుగా తమ కుమారుడు చనిపోవడమేంటి? దీని వెనుక ఏదో మతలబు ఉంది అని మణికంఠ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మణికంఠను స్వామీజీ ఆపడం వెనుక ఏదో ఆంతర్యం, కుట్ర దాగి ఉన్నాయని బాసరలోని స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
ఏప్రిల్ 3న మణికంఠ పుట్టిన రోజు. ఆ మరుసటి రోజు తెల్లవారుజామున మణికంఠ పాఠశాల నుంచి బయటికి వచ్చాడు. టూవీలర్లో పెట్రోల్ నింపుకున్నాడు. ఆ తర్వాత పాఠశాలలో పనిచేసే మాతాజీ తండ్రి.. మణికంఠను పుష్కరఘాట్‌కు రమ్మని పిలిచాడు. దీంతో మణికంఠ పుష్కరఘాట్‌కు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు స్థానికులు చెప్తున్న ప్రకారం ఘాట్ మొత్తం నీటితో శుభ్రం చేయాలని మణికంఠకు మాతాజీ తండ్రి సూచించాడని తెలిసింది. పాఠశాలకు చెందిన మోటర్‌కు నీళ్లు అందడం లేదని, మోటర్‌ను కాస్త నీళ్లలోపలికి నెట్టి.. వైర్ కనెక్షన్ ఇవ్వాలని చెప్పినట్టు సమాచారం. తనకు ఆ పని తెలియదని, నీళ్లలోకి దిగబోనంటూ మణికంఠ నిరాకరించాడని, అయినా కూడా నువ్వే చేయాలి, వేరే ఎవరూ లేరు అంటూ మణికంఠను బలవంతంగా మోటర్ దగ్గరికి పంపినట్టు స్థానికులు చెప్తున్నారు. నీళ్లలోని మోటర్ దగ్గరికి వెళ్లి, వైర్ సరిచేస్తున్న సమయంలో మణికంఠకు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. జరిగిన మొత్తం పరిణామాలు చూస్తుంటే ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం చేసినట్టుగా కనబడుతున్నదని, కానీ పోలీసులు మాత్రం నిర్లక్ష్యం కారణంగా కరెంట్ షాక్‌తో మరణించినట్టు కేసు నమోదుచేశారని మణికంఠ బంధువులు మండిపడుతున్నారు.
మణికంఠ గోదావరిలోకి వెళ్లడం, వైర్ కనెక్షన్ ఇస్తుండగా కరెంట్ షాక్‌తో మృతి చెందడాన్ని ముగ్గురు అమ్మాయిలు చూశారని ఆశ్రమ నిర్వాహకులు చెప్తున్నారు. ఆ ముగ్గురిది నిజామాబాద్ అని పోలీసులకు తెలిపారు. కానీ ముగ్గురు అమ్మాయిలు ఉదయం 4 గంటల సమయంలో పుష్కరఘాట్ వద్ద ఎందుకు ఉన్నారు? అని స్థానికులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
శ్రీవేదభారతీ పీఠం నిర్వాహకుల ఆగడాలకు అదుపులేకుండా పోయిందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఆశ్రమంలో జరుగుతున్న విషయాలు విద్యార్థి లోహిత్‌కు తెలిసిఉంటాయని, అందుకే అతడిని అంతమొందించేందుకే దాడి చేసి ఉంటారని కొందరు అనుమానిస్తున్నారు. లోహిత్‌కు తెలిసిన విషయాలే మణికంఠకు తెలిసి ఉంటాయని, అందుకే అతడిని మట్టుబెట్టారని కొందరు ఆరోపిస్తున్నారు.
మణికంఠ కుటుంబసభ్యులతో గుట్టుచప్పుడు కాకుండా సెటిల్మెంట్ కోసం శ్రీవేదభారతీ పీఠం పాఠశాల నిర్వాహకులు ప్రయత్నించడం విమర్శలకు తావిస్తున్నది. మణికంఠ మృతి చెందిన విషయం తెలియగానే అదేరోజు రాత్రి 9.30 గంటలకు అతని బంధువులు బాసర దవాఖానకు చేరుకున్నారు. రాత్రి 11.30 గంటలకు మృతుడి తల్లిదండ్రులు బాసర చేరుకున్నారు. నా కొడుకును చదువుకోడానికి పంపిస్తే పనులు చేయిస్తారా? మోటర్ పని మావాడికి ఎలా వస్తుం ది? ఇది పాఠశాల నిర్వహకుల నిర్లక్ష్యమే అంటూ మండిపడ్డారు. ఎఫ్ఐఆర్లోనూ ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఉదయం డెడ్‌బాడీతో బాసరలో ధర్నా చేసేందుకు సిద్ధమయ్యా రు. విషయాన్ని పసిగట్టిన పాఠశాల నిర్వహకులు బాసరలో ఓ వర్గం నేతల సహకారంతో ఆందోళనకు ఆటంకం సృష్టించారు. పోలీసులు సైతం మణికంఠ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం భైంసాకు తీసుకువెళ్లాలని, ఏమైనా ఉంటే అక్కడ మాట్లాడుకుందామని చెప్పారు. బాధితుడి కుటుంబసభ్యులు, బంధువులను భైంసాకు తీసుకెళ్లారు. అక్కడ స్వామిజీ శిష్యు లు, పోలీసులు కలిసి మణికంఠ కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చినట్టు తెలిసింది. కొన్ని రోజులయ్యాక వస్తే మాట్లాడుతామని నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు.
స్వామీజీకి సన్నిహితులైన కొందరు మణికంఠ కుటుంబసభ్యులను బాసరకు పిలిపించి, వారితో ఓ లాడ్జిలో రహస్యంగా సమావేశమయ్యారు. బాసరలో ఉంటే ఎవరికైనా తెలిసే ప్రమాదముందని చెప్పి, భైంసాకు తీసుకెళ్లి సెటిల్మెంట్ కోసం మాట్లాడారు. కమిటీ చెప్పిన దానికి కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో మరో సిట్టింగ్‌లో మాట్లాడుకుందామని చెప్పినట్టు తెలిసింది. దీనిపై బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేయగా కాళేశ్వరంలో ఉన్నామని, తర్వాత మాట్లాడుతామని తెలిపారు. తిరిగి ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. ఇలా బాసరలోని శ్రీవేదభారతీ పీఠం పాఠశాలకు చెందిన ఓ విద్యార్థికి ప్రాణాపాయం కలిగేంతగా గాయాలు కావడం, మరో విద్యార్థి మృతి చెందడం మిస్టరీగా మారింది.