Minister Indrakaran Reddy | టీఎస్ కాస్ట్ – బాసర ఆర్జీయూకేటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడంతో విద్యారంగంలో శాస్త్ర, సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా బోధన, పరిశోధన అవకాశాలను మరింత అన్వేషించడానికి ఎంతగానో దోహదపడుతుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం అరణ్య భవన్లో టీఎస్ కాస్ట్ (తెలంగాణ స్టేట్ కౌన్సిల్ అఫ్ సైన్స్ & టెక్నాలజీ) – బాసర ఆర్జీయూకేటీ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. మంత్రి ఇంద్రకరరెడ్డి, ఆర్జీయూకేటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వీ వెంకట రమణ సమక్షంలో ఒప్పందపత్రంపై టీఎస్ కాస్ట్ మెంబర్ సెక్రెటరీ ఎం నగేశ్, ఆర్జీయూకేటీ డైరెక్టర్ సతీశ్ కుమార్ ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మంత్రి మాట్లాడుతూ అవగాహన ఒప్పందం వల్ల టీఎస్ కాస్ట్ – బాసర ఆర్జీయూకేటీ రెండూ ఉమ్మడి ఆసక్తి ఉన్న రంగాలైనా పరిశోధన, శాస్త్ర, సాంకేతిక అభివృద్ధికి, నూతన ఆవిష్కరణలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రయోగశాల నుంచి సాంకేతికతలను జోడిస్తూ ఉమ్మడి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లను నిర్వహించడమే కాకుండా సెమినార్లు, సమావేశాలు, వర్క్‌షాప్‌లు నిర్వహించడానికి టీఎస్ కాస్ట్ ద్వారా ఆర్జీయూకేటీ.. యూజీ, పీజీ విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శాస్త్ర, సాంకేతికతను ఉపయోగించుకోవడం, విద్యార్థుల్లో వీటిపై మరింత ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతోగానో దోహదపడుతాయని పేర్కొన్నారు.
అవగాహన ఒప్పందంతో పరిశోధన కార్యకలాపాలు మెరుగుపరడతాయని, విద్యార్థులకు, అధ్యాపకులకు నూతన ఆవిష్కరణలకు ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశనం, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో బాసర ఆర్జీయూకేటిటీ మౌలిక వసతులు ఎంతో మెరుగుపడ్డాయన్నారు. ప్రశాంతవాతావరణంలో విద్యార్థులు అభ్యసిస్తున్నారని తెలిపారు. నాణ్యమైన విద్యను అందిస్తుండడంతో క్యాంపస్ ర్రికూట్మెంట్తో అవుట్ క్యాంపస్‌లో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెరిగాయని తెలిపారు.
ఆర్జీయూకేటీ సహకారంతో నిర్మల్ జిల్లాను ఐటీ, ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. అదే విధంగా ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వీ వెంకట రమణ, డైరెక్టర్ పీ సతీశ్ కుమార్ పని తీరు బాగుందన్నారు. అనంతరం వీసీ వెంకటరమణ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఆవిష్కరణలను ప్రోత్సహించడం, అంకుర సంస్థల ఏర్పాటుకు ఆర్జీయూకేటీ కృషి చేస్తుందన్నారు. దీంట్లో భాగంగానే నిర్మల్ జిల్లాలో ఆర్జీయూకేటీకి అనుబంధంగా నిర్మల్ ఇన్నోవేషన్ హబ్ (NIH)ను ఏర్పాటు చేస్తామని, నిజామాబాద్‌తో పాటు నిర్మల్ జిల్లాలో కూడా డిజైన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తామన్నారు.