హైదరాబాద్, సెప్టెంబర్19 (నమస్తే తెలంగాణ) : బెస్ట్ అవైలబుల్ స్కీమ్ (బీఏఎస్)కు సంబంధించిన నిధులను రెండేండ్లుగా ప్రభుత్వం చెల్లించడం లేదని, పాఠశాలలను నిర్వహించలేని దుస్థితి నెలకొన్నదని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సర్కార్ వైఖరికి నిరసనగా శనివారం నుంచి పాఠశాలలను మూసివేయాలని బీఏఎస్ ప్రైవేట్ పాఠశాలల రాష్ట్ర సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీలకు చెందిన చిన్నారులకు ఉచిత ప్రైవేట్, కార్పొరేట్ విద్యను అందించేందుకు బెస్ట్ అవైలబుల్ స్కూల్’ పథకాన్ని అమలు చేస్తున్నారు. 17 ఏండ్ల నుంచి ఈ పథకం అమలవుతున్నది. ఈ స్కీమ్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల ద్వారా నోటిఫికేషన్ జారీచేసి, విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ కోటాలో ఎంపికైన వారికి ఫీజులను ప్రభుత్వమే చెల్లించాలి. షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్థులకు 1వ తరగతి, 5వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. గిరిజన విద్యార్థులకు 1, 5, 8వ తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఎంపికైన ప్రాథమిక పాఠశాల విద్యార్థికి ఏడాదికి రూ.28,000, ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు (వసతితో కలిపి) రూ.42,000 చెల్లించాలి.
ప్రాథమికోన్నత విద్యను చదివే విద్యార్థి వసతి గృహంలో ఉండడానికి ఇష్టపడకపోతే అతడికి ఫీజుగా ప్రభుత్వం రూ.28 వేలు ఇవ్వాలి. గిరిజన విభాగంలోనూ ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు. ఒకసారి ప్రవేశం పొందితే పదోతరగతి వరకు ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తూ.. పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్ యూనిఫాం ఉచితంగా అందించాలి. అడ్మిషన్ పొందిన పాఠశాలల్లోని ఫీజులను ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల ద్వారా రీయింబర్స్చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కీమ్‌లో 230 ప్రైవేట్ పాఠశాలల్లో 26వేల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పూర్తి ఉచితంగా విద్యను పొందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కీమ్‌కు సంబంధించి రూ.220కోట్ల నిధులను బకాయి పెట్టింది. దీంతో ఆయా పాఠశాలల యాజమాన్యాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. ఇక ఎంతమాత్రం పాఠశాలలు నడపలేమని, విద్యార్థులను ఈ స్కీమ్ కింద చేర్చుకోబోమని మొరపెట్టుకుంటున్నాయి. నిధులను విడుదల చేయాలని, లేదంటే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని యాజమాన్యాల సంఘం పలుసార్లు హెచ్చరించింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో 20వ తేదీ నుంచి బీఏఎస్ ప్రైవేట్ స్కూళ్లను మూసివేస్తున్నట్టుగా అసోసియేషన్ ప్రకటించింది.