హైదరాబాద్, డిసెంబర్4 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు సంబంధించి తదుపరి సాంకేతిక పరీక్షలను సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్ తెలిపారు. ఆ టెస్టుల రిపోర్టులకు అనుగుణంగా డిజైన్లు రూపొందించాల్సి ఉంటుందని తెలిపారు. బరాజ్‌ల పునరుద్ధరణ పనులకు సంబంధించి డిజైన్లను ఇచ్చేందుకు ఆసక్తి ఉన్న ఏజెన్సీల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ను ఇరిగేషన్‌శాఖ ఆహ్వానించింది.
అందులో సాంకేతిక అర్హతలు సాధించిన సంస్థల నుంచి ప్రైస్‌బిడ్లను కూడా ఇటీవల ఆహ్వానించారు. ఈ నెల 12న ఆ బిడ్లను తెరువనున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత ఏజెన్సీలతో ప్రీ బిడ్ సమావేశాన్ని ఈఎన్సీ అమ్జద్హుస్సేన్ గురువారం జలసౌధలో నిర్వహించారు. బరాజ్‌ల రిపేర్లకు సంబంధించిన సాంకేతిక అంశాలపై సంస్థలు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు.