Telangana Police | హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగ మార్చ్ పేరిట తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం టీజీపీఎస్సీని ముట్టడిని అడ్డుకోవడానికి రాష్ట్రంలో తొలిసారిగా బాహుబలి బారికేడ్లను ప్రయోగించారు. టీజీపీఎస్సీ కార్యాలయం గేటు ఎదురుగా రోడ్డుపై వాటిని మోహరించారు. ఆ బారికేడ్ల లోపలి భాగంలో పోలీసులు నిల్చునే విధంగా ఒక మెట్టు కూడా ఏర్పాటుచేశారు.
ఆ బారికేడ్లు చుట్టూ పోలీసులు పహారా కాశారు. టీజీపీఎస్సీ కార్యాలయంలోకి ఏ ఒక్క వ్యక్తి కూడా దూరిపోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. కాగా, టీజీపీఎస్సీ సమీపంలో ఉన్న శ్రీ కాశీనాథుని ఆల యం లోపలికి పోలీసులు బూటుకాళ్లతోనే వెళ్లి అక్కడ ఉన్న యువకులను అరెస్టు చేశారు. దీంతో ఆలయం ప్రతిష్ఠకు పోలీసులు భంగం కలిగించారు. వెతికి మరీ పట్టుకొని అరెస్టు చేసి, పోలీస్స్టేషన్లకు తరలించారు. దీనిపై ఆధ్యాత్మిక వాదులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.