రవీంద్రభారతి, సెప్టెంబర్ 27: నమ్మిన సిద్ధాంతం కోసం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాన్నే త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం తెలంగాణ సమాజానికి ఆదర్శనీయమని రాష్ట్ర మంత్రులు కొనియాడారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌గౌడ్, జూపల్లి కృష్ణారావు, సీతక్క మాట్లాడారు. తొలుత బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుపెట్టి గౌరవించిందని మంత్రులు తెలిపారు. చేనేత కార్మికుల ఉపాధి కల్పనకు అనేక రకాలుగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వస్ర్తాల మీద జీఎస్టీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ బాపూజీ స్ఫూర్తితో పద్మశాలీలంతా ఐక్యపోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. స్వరాష్ట్రం కోసం మంత్రి పదవినే వదులుకున్న త్యాగజీవి అని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, టీజీఎండీసీ చైర్మన్ అనిల్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, బీసీ కమిషన్ సభ్యుడు సురేందర్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ మాయాదేవి, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగంట్ల స్వామి, వైస్ చైర్మన్ అవ్వారి భాస్కర్ పాల్గొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మొండిచెయ్యి చూపింది. ఇప్పటికే బతుకమ్మ చీరల త యారీని నిలిపివేసిన ప్రభుత్వం నేతన్నల కడుపు కొట్టింది. రాష్ట్రంలోని లక్ష మంది నేతన్నలకు రుణమాఫీ చేస్తామన్న హామీని కూడా తుంగలో తొక్కిందని చేనేత కార్మికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. శుక్రవారం రవీంద్రభారతి వేదికగా అధికారికంగా నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి డుమ్మా కొట్టారు. కేవ లం మంత్రులు పొన్నం, జూపల్లి, తుమ్మ ల, సీతక్క హాజరయ్యారు. ఎలాంటి ప్రకటన చేయకుండానే జయంతి ఉత్సవాలను ముగించడం విమర్శలకు దారితీసింది. సీఎం వచ్చి రుణమాఫీ, ఇతర సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటారని అనుకున్న చేనేత కార్మికులకు నిరాశే ఎదురైంది. దీంతో నేత కార్మికులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా త్వరలోనే నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు చేనేత సంఘాల నాయకులు సిద్ధంగా ఉన్నారు.