హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తేతెలంగాణ) : హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ బిల్లుతో పేదల ఆరోగ్యాన్ని హరిస్తున్న గుట్కా, పాన్ మసాలా వంటి ఉత్పత్తులకు చెక్‌పెట్టడం శుభపరిణామమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యానించారు. తెలంగాణలోని చిన్న దుకాణాలు, పాన్ షాపుల్లో గుట్కాలను విచ్చలవిడిగా అమ్ముతుంటారని, బిల్లుతో వాటికి అడ్డుకట్ట పడుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.
ఈ మేరకు సోమవారం బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో వద్దిరాజు మాట్లాడారు. గుట్కా నిషేధాన్ని తప్పించుకొనేందుకు కంపెనీలు యాలక్కాయ పొడి, మౌత్ ఫ్రెష్నర్ల పేరిట తప్పుడు ప్రకటనలతో వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని తెలిపారు. తాజాగా 25 శాతం ట్యాక్స్ విధించడంతో గుట్కా, పాన్ మసాలా ధరలు పెరిగి పేదలు కొనుక్కొనే పరిస్థితి ఉండదని హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణలోని ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానల్లోని 100 మంది రోగుల్లో 16 మంది గొంతు, నోటి క్యాన్సర్ బాధితులేనని, అమ్మకాలు ఇలాగే సాగితే 2030 నాటికి పరిస్థితి మరింత ప్రమాదకరం కానుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలకు చెందిన బీడీ కార్మికులు క్యాన్సర్‌బారిన పడ్డారని, అయితే పన్ను విధింపు, సెస్ ద్వారా సమకూరే ఆదాయంలో కేంద్రం రాష్ర్టాలకు ఇవ్వనున్న వాటాను బాధితుల చికిత్సకు ఖర్చుచేయాలని కోరారు.