హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): రోజుకో తరహా కొత్త నేర విధానాన్ని తెరమీదకు తెస్తూ అమాయకులపై వల విసురుతూనే ఉన్నారు సైబర్ నేరగాళ్లు. తాజాగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్డేట్ అంటూ కొత్త మోసాలకు తెరతీశారు. ఆన్లైన్ బ్యాంక్ లావాదేవీలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడకం పెరుగడంతో ఈ రూటు ఎంచుకుంటున్నారు. మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్, యూజర్‌నేమ్ అప్డేట్ చేసుకోవాలని, లేదంటే మీ బ్యాంక్ ఖాతాకు లింకు ఉన్న పాన్‌కార్డు అప్డేట్ చేసుకోవాలని బ్యాంకు అధికారుల మాదిరిగా ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. ఈ మెసేజ్‌లలో ఉన్న లింక్‌పై క్లిక్ చేస్తే మీ పాన్‌కార్డు నంబర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు అప్డేట్ అవుతాయని అందులో పేర్కొంటున్నారు.
సైబర్ నేరగాళ్లు పంపుతున్న ఎస్ఎంఎస్లు నిజమేనని నమ్మి ఎవరైనా అందులోని లింక్‌లపై క్లిక్ చేస్తే వారి ఫోన్లోకి ‘వైరస్’ వచ్చేస్తుంది. ఫోన్లోని బ్యాంకు ఖాతా వివరాలు, పాస్వర్డులు ఇలా అన్నింటిని సైబర్ నేరగాళ్లు కొట్టేస్తారు. తర్వాత ఆ వివరాలతో బ్యాంకు ఖాతాలోని డబ్బులు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కొట్టేస్తున్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతాల అప్డేషన్ లేదా యూజర్‌నేమ్, పాస్వర్డ్లు మార్చుకోవాలని, పాన్‌కార్డులు అప్డేట్ చేయాలంటూ వచ్చే అనుమానాస్పద ఎస్ఎంఎస్లు నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఎస్ఎంఎస్లలో ఉండే లింక్‌లపై క్లిక్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు.