హైదరాబాద్, జూన్ 15: హైదరాబాద్‌కు చెందిన కవలలు బని బ్రాతా, బిదిషా మాజీ ఎన్నడూ పాఠశాలకు వెళ్లకుండానే విద్యలో సత్తా చాటారు. దేశంలోనే అత్యంత కఠిన ప్రవేశ పరీక్షలైన జేఈఈ అడ్వాన్స్డ్, నీట్లో ఒకే ఏడాది ఉత్తీర్ణులై అత్యుత్తమ ర్యాంకులతో విజయం సాధించారు. ఇప్పటికే కొలంబియాలోని బొగోటాలో జరిగిన అంతర్జాతీయ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ (ఐజేఎస్వో)లో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్న బని బ్రాతా తాజాగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా 77వ ర్యాంకును సాధించగా.. బిదిషా నీట్లో 95వ ర్యాంకు సాధించింది. చిన్ననాటి నుంచి ఇంట్లోనే విద్యను అభ్యసించి వారు ఈ ఫలితాలు సాధించడం విశేషం. ఈ ఫలితాల మాదిరిగానే వారి తదుపరి లక్ష్యాలు కూడా ఎంతో ప్రతిష్ఠాత్మకమైనవి. ఐఐటీ ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్ చదవాలని బని బ్రాతా లక్ష్యంగా పెట్టుకోగా.. ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)పై బిదిషా దృష్టి సారించింది.
వారి తల్లి ప్రణతి చిన్నప్పటి నుంచే వారికి ఇంటి వద్దే చదువు చెప్పారు. అందుకోసం తన టీచింగ్ ఉద్యోగాన్ని వదులుకున్నారు. విద్యలో తాము స్వతహాగా ఎదిగేందుకు, తమ ఆసక్తులను గమనించేందుకు ఆమె తన కెరీర్‌నే త్యాగం చేశారని బిదిషా తెలిపారు. వారి తండ్రి స్వరూప్ కుమార్ డీఆర్డీవోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. చాలా పాఠశాలలు విద్యార్థులతో పాఠాలను బట్టీ పట్టించడంపై దృష్టి సారించినట్టు గుర్తించడంతో తమ పిల్లలు కేవలం గ్రేడ్లతో కాకుండా లోతుగా ఎదగాలని ఆకాంక్షించామని, దీంతో వారిని 10వ తరగతి వరకు డమ్మీ స్కూల్లో, ఆ తర్వాత జేఈఈ, నీట్ కోచింగ్ కోసం నారాయణ విద్యాసంస్థలో చేర్పించామని స్వరూప్ కుమార్ వివరించారు. ప్రస్తుతం తమ పిల్లలు సాధించిన విజయం వారి ప్రతిభకే కాకుండా నిశబ్ద అంకిత భావం, సంప్రదాయేతర మార్గం, స్వీయ నిర్దేశిత అభ్యాసంపై తమ కుటుంబానికి గల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిందని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈ కుటుంబం గత రెండు దశాబ్దాల నుంచి హైదరాబాద్‌లోనే నివసిస్తున్నది.