హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): దేశాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అమ్ముతూ రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయాలని దీక్షలు చేస్తారా అని బీజేపీపై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నిప్పులు చెరిగారు. 35 ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేసి కోట్లమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతున్నదని ధ్వజమెత్తారు. శనివారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేస్తానని ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 8,72,243 ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌చేశారు. ఈ ఉద్యోగాలు భర్తీ చేయకుండా ప్రధాని మోదీ గుడ్డి గుర్రాల పండ్లు తోముతున్నారా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను అమ్మటం ద్వారా 9,19,479 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టటమే కాకుండా, భవిష్యత్‌లో ఈ వర్గాలను శాశ్వంగా నిరుద్యోగులుగా మార్చిందని విమర్శించారు. జాతీయ నిరుద్యోగ రేటు 7 శాతం ఉంటే, తెలంగాణలో 4 శాతమే ఉన్నదని తెలిపారు. దేశంలో నిరుద్యోగాన్ని తగ్గించటంలో తెలంగాణ రాష్ట్రం టాప్‌లో నిలిచిందని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రులు వెల్లడించిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
బండి సంజయ్‌కి దమ్ముంటే ఏడేండ్లలో కేంద్రప్రభుత్వం భర్తీచేసిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయించాలని సవాల్ విసిరారు. బీజేపీ ప్రభుత్వం అధికారం కోసమే ఎన్నికలుండే రాష్ర్టాలకు ప్యాకేజీలు ప్రకటిస్తున్నదని బాల్క సుమన్ విమర్శించారు.
నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) లెక్కల ప్రకారం దేశంలో ఆత్మహత్యల్లో 24% నిరుద్యోగులే. ఆ చావులకు కారణం ప్రధాని మోదీ కాదా?
బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే నిరుద్యోగం ఎక్కువ ఉన్నది వాస్తవం కాదా?
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నది కేంద్రం కాదా?
13 మంది ప్రధానమంత్రులు 67 ఏండ్లలో రూ. 56 లక్షల కోట్లు అప్పుచేస్తే, మోదీ ‘దేశం కోసం.. ధర్మం కోసం’ అంటూ ఏడేండ్లలోనే రూ.119 లక్షల కోట్ల అప్పు చేసింది వాస్తవం కాదా?
ఐటీఐఆర్ రాకుండా అడ్డుకొని లక్షలమంది యువత ఉపాధికి గండికొట్టింది బీజేపీ కాదా?
సింగరేణి 4 బ్లాకులను వేలం వేయాలన్న నిర్ణయంతో వేల కుటుంబాల జీవితాలతో కేంద్రం చెలగాటం ఆడటం లేదా?