హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): గురుకుల విద్యాలయాలకు రూపొందించిన కొత్త టైం టేబుల్లో పనివేళలను కుదించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం బహిరంగ లేఖ రాశారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు పనివేళలు రూపొందించటం వల్ల టీచర్లు నిద్రలేమి, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని చెప్పారు. టీచర్లకు రాత్రిపూట స్టడీ అవర్, కేర్ టేకర్ విధులను అప్పగించటం సరికాదని అన్నారు. వార్డెన్ పోస్టులు మంజూరైనా భర్తీ చేయకపోవడం బాధాకరమని అన్నారు.
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి సైదులు సూచించారు. ఇటీవల తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి ఎంపికైన నిజామాబాద్ జిల్లా ధర్మవరం గురుకుల కాలేజీ విద్యార్థి, వాలీబాల్ క్రీడాకారుడు బంతిలాల్ సోమవారం సొసైటీ సెక్రటరీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సెక్రటరీ విద్యార్థిని సతరించారు. సెక్రటరీ వెంట జాయింట్ సెక్రటరీ తిరుపతి, కోచ్ హనుమంత్‌రెడ్డి ఉన్నారు.