జనగామ, జూలై 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రాల మధ్య జల వివాదం ఏర్పడినప్పుడు.. వాటిని సమన్వయపరిచి పెద్దన్న పాత్ర పోషించి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని..అందుకే నిపుణుల కమిటీ వేసిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టంచేశారు. శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఆ పార్టీ శ్రేణులకు నిర్వహించిన వర్క్‌షాప్‌లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ బనకచర్ల జల వివాదంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్రమోదీకి అన్నిరాష్ర్టాలు సమానమే అని తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వం అని పేర్కొన్నారు. నీటి విషయంలో రెండు రాష్ర్టాల ప్రయోజనాలు కాపాడుతామని చెప్పారు. ఇరు రాష్ట్రాలు స్వంత ఎజెండాలను తీసుకొని మీటింగ్‌కు వెళ్లడాన్ని దృష్టిలో పెట్టుకొని జలశక్తి శాఖ మంత్రి ఈ అంశాల మీద నిపుణుల కమిటీ వేసి ఎవరికీ అన్యాయం జరగకుండా చూడటానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. దీనిపై 2 రాష్ర్టాల సీఎంలు అబద్ధాలు అడుతున్నారని ఆయన పేర్కొన్నారు.