2022 అక్టోబర్ 28..
ఎమ్మెల్యేలకు ఎర కేసుతో బీజేపీకి సంబం ధమే లేదని అడ్డగోలుగా వాదించిన బండి సంజయ్.. ఏకంగా యాదగిరిగుట్టపై తడిబట్టలతో తప్పుడు ప్రమాణం చేశారు. ఆ రోజే ‘నమస్తే తెలంగాణ’ రాసింది. యాదగిరి నర్సన్న మామూలోడు కాదు.. నాటకాలాడితే నంజుకు తింటడని హెచ్చరించింది. ఆ మాట పొల్లుపోలేదు.
ఏడాది తిరగకముందే..
బండి సంజయ్ పదవి ఊడింది. రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఆయనను బీజేపీ తొలగించింది. సంజయ్ తప్పులు తక్కువేమీకావు. ఆడిన అబద్ధాలకు కొదువేలేదు. కవితపై నోరుపారేసుకోవడం, శవాలు-శివాలు అం టూ వాగడం, ఆఖరికి పేపర్ లీకేజీలో భాగం కావడం.. అన్నీ స్వయంకృతాపరాధాలే!
మిగిలింది రే‘వంతు’..
బండిని చూసి వాతలు పెట్టుకున్న రేవంత్‌రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణాలకు సిద్ధపడ్డాడు. మరి సంజయ్‌లాగే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌కూ తగిన శాస్తి తప్పదా?
Bandi Sanjay |స్పెషల్ టాస్క్బ్యూరోహైదరాబాద్, జూలై 4, (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై కొద్దిరోజులుగా మీడియాలో జరుగుతున్న ప్రచారమే నిజమైంది. ఎన్నికల ముందు అధ్యక్షుడిని మార్చే ప్రసక్తే లేదని, పార్టీలో అలాంటి చర్చనే జరుగలేదని గల్లీ నుంచి ఢిల్లీ దాకా పార్టీ నేతలు నిర్దందంగా ఖండిస్తూ వచ్చినా.. చివరకు మంగళవారం బండి సంజయ్‌కి బీజేపీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. ఆయనను అధ్యక్ష పదవినుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించింది.
ఇదంతా బండి స్వయంకృతాపరాథమేనని సొంత పార్టీ నాయకులు పేర్కొంటుండగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నించడంపై యాదగిరి నరసింహుడి ఎదుట తడిబట్టలతో అబద్ధపు ప్రమాణం చేసినందుకు బండి పాపం పండిందని ప్రజలు అంటున్నారు. మతవిద్వేషాలు రెచ్చగొడుతూ.. చిల్లర రాజకీయాలు చేసినందుకు బండి సంజయ్‌కి తగిన శాస్తి జరిగిందని ఆనందపడుతున్నారు. ఒంటెత్తు పోకడలతో తెలంగాణ బీజేపీలో సంజయ్ చీలికలు తెచ్చారని సొంత పార్టీ నాయకులే మండిపడుతున్నారు ఈ సమయంలో రాష్ట్ర అధ్యక్షుడి పదవినుంచి ఆయనను తొలగించడం సరైన నిర్ణయం అని అంటున్నారు.
మత విద్వేషాలతో పబ్బం
బీజేపీ రాష్ర్టాధ్యక్షుడిగా బండి సంజయ్ మత విద్వేషాలను రెచ్చగొడుతూ పబ్బం గడిపారు. చిల్లర రాజకీయం.. చీప్ పబ్లిసిటీతో రాజకీయాల్లో హుందాతనం పోగొట్టిన ఆద్యుడు సంజయే అని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నా రాష్ర్టానికి కొత్తగా ఏమీ తీసుకురాని సంజయ్.. హిందూ సెంటిమెంట్‌తో ఓట్లు కొల్లగొట్టేందుకు ఎంతకైనా తెగించేందుకు వెనుకాడలేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంలో ‘పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్’, ‘చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం’ అంటూ సెంటిమెంట్ రెచ్చగొట్టారు. హైదరాబాద్ వరదల్లో ‘ఇండ్లు పోతే ఇండ్లు’.. ‘బండి పోతే బండి’ ఇస్తామని అబద్ధపు ప్రచారంతో గ్రేటర్ ఓటర్ల చెవ్వుల్లో పువ్వుల్లో పెట్టారు. ఆ తర్వాత ‘సమాధులు తవ్వుదాం.. శవాలు బయటపడితే మీకు.. శివాలు బయటపడితే మాకు’ అంటూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి, బీజేపీ పరువును సమాధి చేశారు. వీటన్నింటి ఫలితంగానే ప్రజల్లో కాషాయ పార్టీ చులకనైపోయిందని పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శించారు.
కమలానికి కాంగ్రెస్ కల్చర్
బీజేపీ అంటే ఒక క్రమశిక్షణ, సిద్ధాంతం, నిబద్ధత కలిగిన పార్టీగా.. విలువలు, నీతి నిజాయితీకి కట్టుబడే శ్రేణులు, నాయకులకు పెట్టింది పేరుగా ఉంటుందనే అభిప్రాయం గతంలో ఉండేది. కానీ బండి సంజయ్‌తోనే పార్టీలో కాంగ్రెస్ కల్చర్ అలవడిందనే విమర్శ ఉన్నది. సాధారణంగా బీజేపీ నాయకులు పార్టీని వదిలిపెట్టి పోవడం తక్కువే. కానీ బండి హయాంలో అనేక మంది పార్టీని వదిలేసి వెళ్లిపోయారు. బీజేపీ నాయకులు కూడా బజారున పడి ఒకర్ని ఒకరు నిందించుకోవడం, గోతులు తవ్వుకోవడం, చీటికి మాటికి ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేసుకోవడం వంటి కాంగ్రెస్ కల్చర్ బండి పుణ్యమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
సీనియర్లు అంటే లెక్కలేనితనం
ఆదినుంచీ పార్టీలో సీనియర్లను పక్కన పెట్టి తన వందిమాగధులను మాత్రమే బండి సంజయ్ ప్రోత్సహిస్తూ వచ్చారు. ప్రధాని మోదీ, అమిత్ షావంటి నేతల మద్దతు తనకుందన్న ధీమాతో పార్టీలో సీనియర పట్ల అగౌరవంగా ప్రవర్తించడం వల్లే అందరినీ దూరం చేసుకున్నారనే విమర్శ ఉన్నది. ఇక అధిష్ఠానం మెప్పుపొందేందుకు.. తన స్వామి భక్తిని ప్రదర్శించుకునేందుకు అమిత్ షా చెప్పులు మోసేందుకు కూడా బండి వెనుకాడలేదు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో అమిత్ షా చెప్పులు మోసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచడంపై పెద్ద దుమారమే చెలరేగింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో ‘దేవుడన్నా మోదీ’ అంటూ ప్రధాని దృష్టిలో పడేందుకు నానా తంటాలుపడ్డారు. అయినా చివరకు తన స్వయంకృతాపరాథంతో ఉన్న పదవిని పోగొట్టుకొని తెలంగాణ సమాజంలో బండి సంజయ్ నవ్వులపాలయ్యారు.
నోటి దురుసుతో పార్టీకి తీరని నష్టం
బండి సంజయ్ తన నోటి దురుసుతో పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ చేశారని పార్టీ నాయకులే వాపోతున్నారు. పార్టీ ఏదైనా సీఎం పదవికి గౌరవం ఇస్తుంది. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలకు కూడా ఓ హద్దుపద్దూ అనేది ఉంటుంది. కానీ బండి సంజయ్ మాత్రం ముఖ్యమంత్రితోపాటు మంత్రులపై అదుపుతప్పి చేసిన వ్యాఖ్యలు అనేకసార్లు వివాదాస్పదమయ్యాయి. పార్టీ అధ్యక్షుడు అయినంత మాత్రానా ఎవరినైనా ఎంత మాటైనా అనొచ్చా? అని ప్రజల నుంచి ఛీత్కారాలను చవిచూసారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన కల్వకుంట్ల కవిత పేరును ఢిల్లీ లిక్కర్ పాలసీలో ప్రస్తావిస్తూ ‘అరెస్టు చేయకుంటే.. ముద్దుపెట్టుకుంటారా’ అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఎంతగా వివాదాస్పదమయ్యాయో అందరికీ తెలిసిందే.
బండి సంజయ్ స్వయంగా మహిళా కమిషన్ ఎదుట హాజరై చివరకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. తెలంగాణ సర్కారు నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలిచ్చేందుకు నోటిఫికేషన్లు ఇస్తుంటే.. తమకు కార్యకర్తలు దొరకకుండా బీఆర్ఎస్ కుట్ర పన్నుతున్నదంటూ బండి సంజయ్ చిల్లర వ్యాఖ్యాలు చేశారు. దీనిపై అటు నిరుద్యోగులతోపాటు రాష్ట్ర ప్రజలు, సొంత పార్టీ నాయకులే మండిపడ్డారు. టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంతో బండి సంజయ్ బీజేపీ పరువును బజారుకీడ్చారు. ఈ కేసులో కీలక సాక్ష్యంగా ఉన్న తన ఫోన్ పోయిందంటూ చిల్లర డ్రామాలు ఆడి చీప్ అయిపోయారు.