హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : భూములను అమ్మకుంటే రాష్ర్టాన్ని పాలించే పరిస్థితి లేదా? భూములను అమ్మి వేల కోట్లు దండుకోవడమే మీ పనా? అని కేంద్ర మంత్రి బండి సంజయ్ రేవంత్ సర్కారును ప్రశ్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను రక్షించేందుకు ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. హెచ్‌సీయూ భూముల రక్షణ కోసం విద్యార్థులు ఆందోళనకు దిగితే వారిని గొడ్డును బాదినట్టు బాదుతరా? అని ప్రశ్నించారు. అమ్మాయిలని కూడా చూడకుండా జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి కొడతరా? ముఖ్యమంత్రి మానవత్వం లేదా? అని మండిపడ్డారు.
విద్యార్థులపై పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రాష్ర్టానికే తలమానికం అని ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హెచ్‌సీయూ భూములు అమ్మి అప్పులు కట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, అధ్యాపకులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నట్టు ప్రకటించారు. హెచ్‌సీయూ భూములపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సూచించారు. హెచ్‌సీయూ విద్యార్థులపై పోలీసుల నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. వర్సిటీ భూమిని అమ్మకానికి పెట్టే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల నిర్బంధానికి నిరసనగా మంగళవారం హెచ్‌సీయూ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు.
హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకంపై మావోయిస్టు పార్టీ స్పందించింది. యూనివర్సిటీలో మునుపెన్నడూ లేనివిధంగా భూముల విక్రయంపై పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 32వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టబద్ధత కల్పించిన సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మకానికి పెట్టడం అత్యంత దారుణమని మండిపడ్డారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రశ్నించే గొంతులను నొక్కేయడం సరికాదన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేయకూడదని మార్చి 13న ప్రభుత్వం విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఒక లేఖ విడుదల చేశారు. ప్రజావ్యతిరేక, బూర్జువా అనుకూల ఆంక్షలను ఎత్తివేసే వరకు విద్యార్థులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకించిన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేని పేర్కొన్నారు.