Bandi Sanjay : ఉపాధ్యాయులతో కన్నీళ్లు పెట్టించే ఏ రాజ్యం బాగుపడదని, ఈ పచ్చి నిజాన్ని కాంగ్రెస్ పాలకులు గ్రహించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అర్ధాకలితో అలమటిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న గురువులందరికీ శుభాకాంక్షలు తెలిపుతున్నానని అన్నారు.
రాష్ట్రంలో పీఆర్సీ అమలు కాకపోయినా, డీఏలు ఇవ్వకపోయినా ఓర్పుతో ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారని బండి సంజయ్ కొనియాడారు. బడినే సర్వస్వంగా భావించి కొవ్వొత్తిలా కరిగిన రిటైర్డ్ టీచర్లు.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక మలిసంధ్యలో ఆఫీసుల చుట్టూ కాళ్లకు చెప్పులరిగేలా తిరగడం అత్యంత విచారకరమన్నారు. స్వయంగా ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నప్పటికీ ఉపాధ్యాయుల కనీస సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోకపోవడం శోచనీయమని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా గురువులకు ఉచిత హామీల పాఠాలు చెప్పడం మానేసి, వారి సమస్యలను పరిష్కరించడం అనే ప్రాథమిక పాఠాన్ని నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. టీచర్స్ డే రోజైనా ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇవ్వడమే ఆ ఉపాధ్యాయ లోకానికి ఇచ్చే నిజమైన గౌరవమని స్పష్టంచేశారు.