హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఆ పార్టీలో అసమ్మతి గళాలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా చేరారు. మసీదులు తవ్వుదాం.. అంటూ గతంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా కొండా స్పందించారని కథనాలు వచ్చాయి. బండి సంజయ్ వ్యాఖ్యలను తాను సమర్థించబోనని కొండా స్పష్టం చేసినట్టు ఆ కథనాల్లో పేర్కొన్నారు. శివలింగం ఉన్నదా లేదా అని ప్రతి మసీదును తవ్వాల్సిన పనిలేదని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పిన మాటను మరిచిపోవద్దంటూ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హితవు పలికారని వెల్లడించారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పటికే బండి సంజయ్‌కి పరోక్షంగా కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అధ్యక్ష పదవి అంటే పవర్ సెంటర్ కాదని, కేవలం కోఆర్డినేషన్ మాత్రమేనని అరవింద్ ఇటీవలే వ్యాఖ్యానించారు. ఇది బండికి, ఆయనకు మధ్య విబేధాలకు అద్దం పట్టింది. తనను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతున్నారని, ఎలాంటి పని అప్పగించడం లేదని గతంలో విజయశాంతి సైతం వ్యాఖ్యానించారు. బండి సంజయ్ అవినీతిపరుడని, పార్టీని నాశనం చేస్తున్నారంటూ శేఖర్‌రావు వంటి సీనియర్ నేతలు విమర్శలు గుప్పించారు. పార్టీలో బండి సంజయ్‌కి వ్యతిరేకంగా ఒక వర్గం తయారైందనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు కొండా కూడా ఆ జాబితాలో చేరారంటూ పార్టీలో చెప్పుకుంటున్నారు.