హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ హయాంలో కులవృత్తులు విధ్వంసానికి గురయ్యాయని కూడా తొండి సంజయ్ రెచ్చిపోతున్నాడు. తన మాటలతో తానే ఓ బండి కట్టుకొని కయ్యలోకి ఉరుకుతున్నాడు. మీడియా దృష్టిలో పడాలంటే అబద్ధాలు సరిపోవని అనుకున్నాడేమో.. పచ్చి అబద్ధాలు ఏరుకొస్తున్నాడు. అన్నేండ్ల ఢిల్లీ పాలనలో కులవృత్తులు ధ్వంసమయ్యాయని గోరటి వెంకన్న నాడు పాటకడితే ఆ గోస తెలిసిన కేసీఆర్ పథకాలు నేడు పల్లె కన్నీరు తుడిచే స్నేహ హస్తాలయ్యాయి. ఒక్కో కులాన్ని ఆత్మగౌరవంతో బతికేలా సర్కారు అండదండలు అందిస్తుంటే ఈయనేమో ఉల్టాపుల్టా అవుతున్నాడు. కపటప్రేమ ఒలకబోస్తున్నారు.
కులవృత్తులకు గౌరవం తెచ్చిందెవరు?
కులవృత్తులకు పూర్వవైభవం, మన్నన కల్పించేందుకు ప్రత్యేకంగా నడుం బిగించిన ప్రభుత్వం ఏది? రాష్ట్రంలోనే కాదు.. దేశంలో ఏ మూలకు వెళ్లి అడిగినా చెప్తారు.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వమని.. కులవృత్తులకు పునర్వైభవం తేవడానికి.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పట్టణ ఆర్థిక వ్యవస్థతో ఉరకలు పెట్టేందుకు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి వ్యయంగా ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. సబ్బండ వర్ణాలకు మునుపెన్నడూ లేనివిధంగా సంతృప్తికరంగా జీవన ప్రమాణాలు ఎన్నో రెట్లు పెరిగేలా కార్యాచరణ చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ. కనీసం ఈ ఇంగితమైనా బండి సంజయ్‌కి లేకపాయె.. బరితెగించి ఏది మాట్లాడితే అది జనం నమ్ముతారనుకుంటే అది భ్రమకాక మరేమిటి? ఈయనగారు చెప్పే సుద్దులు ఈయన అనుచరులకైతే నచ్చవచ్చు కానీ, ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాలు అందుకుంటున్న కోట్లాది ప్రజలను ఏ విధంగా మభ్య పెట్టగలరు?
ఈ పథకాలన్నీ కనిపిస్తలేవా?
దళితులకు దళితబంధు, రైతులకు రైతుబంధు, బీమా, కురుమలు, యాదవులకు గొర్రెలు, బర్రెలు పంపిణీ.. మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ, వలలు, రవాణా వాహనాలు, నేతకార్మికులకు చేయూత.. గీతకార్మికులకు భృతి, ఈతవనాల పెంపు నీరా కేఫ్, ఎక్స్‌గ్రేషియా పెంపు, రజకులకు దోభీఘాట్లు, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్తు, ఆధునిక సెలూన్లు.. మద్యం షాపుల్లో రిజర్వేషన్లు, బీడీ కార్మికులకు పింఛను.. అర్చకులకు వేతనాలు, ధూపదీప నైవేద్యాలకోసం నిధులు.. వంటివన్నీ కండ్లకు కనిపిస్తలేవా? దేశంలో ఇలాంటి పథకాలు అమలుచేస్తున్న రాష్ర్టాలు ఎక్కడైనా ఉన్నాయా? కులవృత్తులకు ప్రోత్సాహం ఒక్కటే కాకుండా కులసంఘాలకు దన్నుగా నిలుస్తున్న సర్కారు ఏదైనా ఉందా? కులసంఘాల భవనాలకు స్థలం కేటాయించి వాటిని ప్రభుత్వమే నిర్మిస్తున్నది. 40 కుల సంఘాల భవనాల నిర్మాణం కోసం టీఆర్ఎస్ ఫ్రభుత్వం 82.30 ఎకరాలు కేటాయించి రూ. 95.25 కోట్లు ఖర్చు చేస్తున్నది.
మతాన్ని అడ్డగోలుగా వాడుకొంటున్నది ఎవరు?
మతాన్ని అడ్డగోలుగా వాడుకొంటున్న పార్టీ ఏదంటే.. దేశంలోనే కాదు.. యావత్ప్రపంచంలోనూ వినిపించే సమాధానం ఒక్కటే.. బీజేపీ అని. తాలిబన్, గీలిబన్ అని మాట్లాడే బండిసంజయ్.. రాష్ట్రంలో గత ఏడేండ్లలో ఒక్కటంటే ఒక్కటైనా మత కల్లోల ఘటన జరిగిన సందర్భం చూపగలరా? అన్ని మతాలు, కులాలకు అతీతంగా సామరస్యత వెల్లివిరుస్తున్న రాష్ట్రం తెలంగాణయే. లించింగ్ ఘటనలకు ఇక్కడ తావులేదు. సౌభ్రాతృత్వానికి కేంద్రస్థానమైన తెలంగాణలో మైకు దొరికింది కదా అని శిగమొచ్చి ఊగిపోతే.. సమాజం హర్షిస్తుందా?