Bandi Sanjay | హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): కిందపడినా.. పైచేయి మాదేననే వారి కి బీజేపీలో కొదవే లేదు. అందులో ముందు వరుసలో నిలుస్తారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అసెంబ్లీ ఎన్నికల్లో కన్నడిగులు ఇచ్చిన షాక్‌కు మతిభ్రమించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. బీజేపీ బొక్కబోర్లా పడ్డా.. ఓటమిని హుందాగా ఒప్పుకోకుండా.. మాకు సీట్లు తగ్గినా.. బలం తగ్గలేదు అని గొప్పలకుపోతున్నారు. ఒక రాష్ట్ర గెలుపు ను మరో రాష్ర్టానికి ముడిపెట్టొద్దు అంటూనే రేపు తెలంగాణలో గెలిచేది తామేనని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
కర్ణాటకలో మాకు సీట్లు తగ్గాయి.. కానీ ఓట్ల శాతం తగ్గలేదు.. అంటే ప్రజలు తమ వెంటే ఉన్నారని కొత్త లాజిక్‌ను చెప్పుకొచ్చారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఇలా తలాతోకా లేని మాటలు మాట్లాడుతూ పొంతన లేని వాదనలు చేస్తున్నారని ఆయన పార్టీ నేతలే తలలు పట్టుకున్నారు. పార్టీలన్నీ కలిసి మతరాజకీయాలు చేయటం వల్లే తమకు సీట్లు తగ్గాయని సంజయ్ చేసిన వాదనను విన్నవారంతా నవ్వుకుంటున్నారు.
పొద్దున లేస్తే మతం పేరుతో రాజకీయాలు చేసే సంజయ్ ఇలా వ్యాఖ్యానించటం ప్రజాస్వామ్యాన్ని అవమానపర్చినట్టేనని విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. కర్ణాటక ఫలితాలు చూసి తెలంగాణలో హిందువులంతా ఏకమవుతారని, తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు, ఎంఐఎం ఇతర ఎన్ని పార్టీలు కలిసి ఎంత ఐక్యంగా పోటీ చేస్తే తమకు అంతమంచిదని, అర్థంపర్థం లేని వ్యాఖ్యలతో అయోమయంగా మాట్లాడారు.