Bandi Bhageerath | పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ పోలీసుల కస్టడీ ముగిసింది. మూడు రోజుల విచారణ ముగియడంతో కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు.
కాగా, ప్రత్యేక దర్యాప్తు అధికారి, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణలో బండి భగీరథ్‌ను పోలీసులు మూడు రోజుల పాటు విచారించారు. బుధవారం నాడు కోర్టు అనుమతితో పేట్‌బషీరాబాద్ పోలీసులు బండి సాయిభగీరథ్‌ను తమ కస్టడీలోకి తీసుకున్నారు. ముందుగా నిందితుడిని జైలు నుంచి మేడ్చల్‌లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించి, అక్కడ వైద్యపరీక్షలు జరిపించారు.
పొక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచి చర్లపల్లి జైలుకు తరలించిన పోలీసులు https://t.co/jby26W1JdV pic.twitter.com/AXoWj3ro6O
— Telugu Scribe (@TeluguScribe) May 29, 2026
అనంతరం సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు మొయినాబాద్‌లోని అరణ్య ఫామ్‌హౌస్‌కు తరలించారు. గత డిసెంబర్ 31న భగీరథ్ తన స్నేహితులతో కలిసి బాధితురాలిని అరణ్య ఫామ్‌హౌస్‌కి తీసుకువచ్చి, అఘాయిత్యానికి పాల్పడినట్టు బాధితురాలు, ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకొనేందుకు నిందితుడిని ఫామ్‌హౌస్‌కు తీసుకొచ్చిన పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసినట్టు తెలిసింది. ఆ రోజు ఏమి జరిగింది, ఫామ్‌హౌస్‌లో ఎవరెవరు ఉన్నారు? బాధితురాలిపై జరిగిన అఘాయిత్యానికి ఎవరెవరు సహకరించారు? బాధితురాలికి మద్యం తాగించడంలో ఎవరు కీలకపాత్ర పోషించారు? ఫామ్‌హౌస్‌లో ఎవరెవరు ఏయే గదుల్లో ఉన్నారు? మరుసటి రోజు ఫామ్‌హౌస్ నుంచి ఎక్కడికి వెళ్లారు? తదితర అంశాలను నిందితుడి ద్వారా సేకరించినట్టు తెలిసింది. దాదాపు నాలుగు గంటల పాటు నిందితుడిని ఫామ్‌హౌస్‌లోనే విచారించిన పోలీసులు ఆ తరువాత షాపూర్‌నగర్‌లో ని కూకట్పల్లి డీసీపీ కార్యాలయానికి తరలించారు. అక్కడ సాయంత్రం వరకు విచారణ జ రిపిన అనంతరం పేట్‌బషీరాబాద్ ఠాణాకు తీ సుకెళ్లారు.
రెండో రోజు విచారణలో భాగంగా పోక్సో కేసును నీరుగార్చేందుకు సాక్ష్యాలను మాయం చేసినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు ఆ దిశగా ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. సాక్ష్యాలు లేకుండా కుట్ర చేసేందుకు సహకరించిందెవరు, బాధితులను బెదిరించిందెవరు? తదితర అంశాలపై నిందితుడి నుంచి సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే భగీరథ్ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నట్టు తెలిసింది.
సాంకేతికపరమైన సాక్ష్యాలు లేకుండా ఫోన్లను ఫార్మాట్ చేయడం, సోషల్‌మీడియా అకౌంట్స్‌ను డిలీట్ చేయడం వంటి విషయాలను కూడా ప్రస్తావించారు. మొదటి రోజు మొయినాబాద్ ఫామ్‌హౌస్ వద్ద విచారణ చేసిన పోలీసులు ఇప్పటివరకు సేకరించిన ఆధారాలతో రెండోరోజు మరింత సమాచారం రాబట్టినట్టు తెలిసింది. బాధితురాలి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో భగీరథ్ స్నేహితుల పేర్లను కూడా ప్రస్తావించిన నేపథ్యంలో పోలీసులు వారిలో కొందరిని ఇప్పటికే విచారించి, ఈ కేసుతో వారికున్న సంబంధాలను ఆరా తీశారు.
స్నేహితులు చెప్పిన విషయాలు, నిందితుడు చెప్పిన విషయాలను సరిపోల్చుతూ విచారించినట్టు తెలిసింది. నిందితుడిపై కేసు నమోదు కాగానే అతడి ఫోన్ ఫార్మాట్ అయినట్టు, అదేరోజు అతడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా డిలీట్ అయినట్టు ఆరోపణలు వచ్చాయి, పోలీసులు ఆ సమాచారాన్ని సేకరించి, అందుకుగల కారణాలను ఆరా తీసి ఆ మేరకు కేసులో సెక్షన్లను కూడా జోడించారు. విచారణకు హాజరుకావాలంటూ ఈ నెల 12న పోలీసులు ఇచ్చిన నోటీసుపై రెండు రోజుల గడువు కోరుతూ భగీరథ్ ఈమెయిల్ ద్వారా సమాచారం పంపించాడు. ఆ ఈమెయిల్ పంపిందెవరు? నోటీసు ఇచ్చిన సమయంలో భగీరథ్ ఎక్కడున్నాడని ప్రశ్నించినట్టు తెలిసింది. సాక్ష్యాధారాలను తొలగించడం, పోలీసులకు దొరుకకుండా అజ్ఞాతంలో ఉండటానికి ఎవరెవరు సహకరించారనే అంశాలను కూడా నిందితుడి నుంచి పోలీసులు రాబట్టినట్టు తెలిసింది.
పోలీసులకు ఫిర్యాదు చేయకుండా బాధితురాలి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసిందెవరు? వారిని బెదిరించింది ఎవరు? బాధితురాలు విషయం బయటపెట్టకుండా ఉండేందుకు రాజీ ప్రయత్నాలు ఎవరు చేశారు? తదితర అంశాలపై పోలీసులు వివరాలు సేకరించినట్టు తెలిసింది. బాధితురాలు మైనర్ అని తెలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లకుండా అడ్డుకున్నదెవరు? నిందితుడిని ఈ కేసు నుంచి కాపాడేందుకు ప్రయత్నించిన వారు ఎవరు అన్న వివరాలను కూడా సేకరించినట్టు సమాచారం.
ఈ నెల 8న బాధితురాలి కుటుంబం పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన సమయంలోనే.. కరీంనగర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో భగీరథ్ బాధితురాలిపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కరీంనగర్లో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి నేరుగా ఫిర్యాదు చేశావా? లేక పోలీసులు వచ్చి ఫిర్యాదు తీసుకున్నారా? ఆ రోజు నీవు ఎక్కడున్నావు? మీరు ఫిర్యాదు ఇవ్వగానే కేసు నమోదు చేయడానికి అక్కడి పోలీసులపై ఒత్తిళ్లు చేశారా? అనే అంశాలను నిందితుడి ముందు ఉంచినట్టు తెలిసింది. అలాగే నిర్మల్ పోలీసులకు ఫిర్యాదు చేయించి, బాధితురాలిని బెదిరించి, ఆమె ఫోన్‌ను బలవంతంగా తీసుకోవడానికి ప్రయత్నించినట్టు వచ్చిన ఆరోపణలను సైతం ప్రస్తావించినట్టు తెలిసింది. అయితే వీటన్నింటికి నిందితుడు సరైన సమాధానాలు చెప్పకుండా మౌనంగా ఉన్నట్టు సమాచారం. ఇక మూడో రోజు బాధితురాలితో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్‌చాట్‌లో చాటింగ్లకు సంబంధించి సేకరించిన పలు ఆధారాలపై భగీరథ్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది.