Fee Reimbursement | హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలనే డిమాండ్‌తో ఫార్మసీ కాలేజీలను శుక్రవారం నుంచి నిరవధికంగా బంద్ చేయనున్నట్టు ఫార్మసీ కాలేజీల యాజమాన్య సంఘం ప్రకటించింది. యూనియన్ ప్రెసిడెంట్ టీ జైపాల్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు కే రామదాసు, జనరల్ సెక్రటరీ పుల్ల రమేశ్‌బాబు గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం రూ. 550 కోట్ల రీయింబర్స్‌మెంట్‌ను పెండింగ్‌లో పెట్టిందని వాపోయారు.
ఐదు నెలల నుంచి పలుమార్లు విజ్ఞప్తిచేసినా పట్టించుకోవడంలేదని విమర్శించారు. మూడు నెలల క్రితం జేఎన్టీయూలో జరిగిన సమావేశంలో నెలలోపు ఫీజు మొత్తాన్ని విడుదల చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ అతీగతిలేకుండా పోయిందని మండిపడ్డారు. రీయింబర్స్మెంట్ రాకపోవడంతో కాలేజీ భవనాల అద్దె, ఉ ద్యోగులకు వేతనాలివ్వలేని స్థితికి చేరామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఫీజులను విడుదల చేయాలని కోరారు. యూనియన్ ఈసీ మెంబర్స్ ప్రభాకర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, సుధీర్, బొమ్మ శ్రీధర్, కడియాల సతీశ్, ఎండీ గౌస్, ఎం మధుసూదన్‌రెడ్డి ఉన్నారు.