హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తేతెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటల అన్యాక్రాంతంపై సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ పేర్కొన్నారు. మండలిలో బిల్లులపై జరిగిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల అరికట్టేందుకు హైడ్రా ఏర్పాటును సమర్థిస్తున్నట్టు చెప్పారు.
ఆక్రమణలు తొలగించినప్పుడు గతంలో పేదలకు ఇచ్చిన పట్టాల్లో నిర్మించుకున్న ఇండ్లను కూల్చవద్దని సూచించారు. నగర శివారులోని మున్సిపాలిటీల్లో గ్రామపంచాయతీల విలీనంతో అక్కడ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో 50 శాతానికి లోబడి బీసీ రిజర్వేషన్లు అమలుచేస్తామని చెప్పడం సమంజసం కాదన్నారు.