వరంగల్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘ఏక్ పోలీసు, ఏక్ స్టేట్ కావాలి’ అని కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు నిరసన తెలుపుతున్న సమయంలోనే.. ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇంట్లో పెండ్లికి బెటాలియన్ కానిస్టేబుళ్లతో బ్యాండ్ కొట్టించారు. మాజీ ఐపీఎస్ అధికారి కుటుంబంలోని ఓ పెండ్లి వరంగల్ నగరం కాజీపేటలోని ఓ చర్చిలో శనివారం జరిగింది. మామునూరులోని నాలుగో బెటాలియన్ పరేడ్‌లో పాల్గొనే కానిస్టేబుళ్లకు ఈ పెండ్లిలో బ్యాండ్ పనులు అప్పగించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మామునూరు బెటాలియన్‌లోని కానిస్టేబుళ్లు.. అధికారి కుటుంబంలో పెండ్లికి బ్యాండు కొట్టారు. పెండ్లికి ముందు రోజు రిహార్సల్ చేసి మరీ పంపించారు. కుటుంబ సభ్యులు తమ కోసం నిరసనలు తెలుపుతుంటే తాము వెట్టి పనులు చేయా ల్సి వస్తున్నదని వాపోయారు. బెటాలియన్ కానిస్టేబుళ్లకు బ్యాండ్ పనులపై ఫొటోలు తీసేందుకు వెళ్లిన ‘నమస్తే తెలంగాణ’ సిబ్బందిపై సదరు మాజీ ఐపీఎస్ అధికారి బెదిరింపులకు దిగారు. ‘పోలీసు కుటుంబాల్లో ఫంక్షన్లకు బెటాలియన్లలోని బ్యాండ్ పార్టీని పిలవడం నిబంధనలో ఉన్నది. మూడు నెలల ముందే డబ్బులు కట్టి అనుమతి తెచ్చుకున్నాం. ఫొటోలు తీస్తే చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు.