మహబూబాబాద్, జూలై 25(నమస్తే తెలంగాణ): బనకచర్ల పేరుతో తెలంగాణ నీళ్లను ఆంధ్రకు తరలించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతున్నదని, దీన్ని అందరం కలిసి అడ్డుకోవాలని బీఆర్ఎస్వీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు గుగులోత్ రవినాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో వికాస్ ఇంటర్ విద్యాసంస్థలో బీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి బండి దీపక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణంతో తెలంగాణకు జరిగే నష్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ చీకటి ఒప్పందంతో తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టకపోతే భవిష్యత్ తరాలు తీవ్రంగా నష్టపోతాయని గుగులోత్ రవినాయక్ తెలిపారు.