హైదరాబాద్, మే 5(నమస్తే తెలంగాణ): ఇప్పటికే యూరియా కొరతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారిగా యూరియా విక్రయాలపై నిషేధం విధించింది. రైతులకు యూరియా విక్రయించొద్దని, అమ్మకాలను పూర్తిగా నిలిపివేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు అంతర్గత ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అధికారులు యూరియా విక్రయాలను పూర్తిగా బంద్ చేశారు. రైతులకు కనీసం ఒకటంటే ఒక బస్తా కూడా అందని పరిస్థితి నెలకొన్నది.
యాసంగి పంటల సాగు పూర్తి కావడాన్ని సాకుగా చూపుతూ, ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ సర్కార్ సమర్థించుకుంటున్నది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో ప్రస్తుతం యూరియా అవసరం ఉన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. కూరగాయలు, పండ్లతోటలు సాగు చేసే ఉద్యాన రైతులకు సైతం యూరియా విక్రయాలను నిషేధించడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
యాసంగి సీజన్ ముగిసినందున ప్రస్తుతం రైతులెవరూ పంటలు సాగు చేయడం లేదన్న కుంటి సాకుతో ప్రభుత్వం యూరియా పంపిణీ నిలిపివేసినట్టు తెలిసింది. ఇది అనాలోచిత నిర్ణయం అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ‘సరార్ ఉద్దేశంలో పంటలు అంటే వరి, మక్కజొన్న, పత్తి మాత్రమేనా? ఉద్యాన పంటలను పరిగణనలోకి తీసుకోరా? కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేసే రైతులు రైతులు కాదా? వారి ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోదా? ఉద్యానపంటల పరిస్థితి ఏంకావాలి?’ అని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వాస్తవానికి, రాష్ట్రంలో కూరగాయలు, ఉద్యాన పంటలకు నిరంతరం యూరియా వేయాల్సి ఉంటుంది.
ముఖ్యంగా కూరగాయలు, ఆయిల్‌పామ్ వంటి పంటలకు యూరియా అత్యవసరం. అయితే, యూరియా పంపిణీ నిలిపివేయడంతో ఉద్యాన రైతులు ఇబ్బందులు ఎదురొంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రణాళికా లేమి రైతులకు శాపంగా మారింది. రానున్న వానకాలానికి 10 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద 1.5 లక్షల టన్నల యూరియా మాత్రమే అందుబాటులో ఉన్నదని సమాచారం.
ఈ నేపథ్యంలో సీజన్ మొదలైతే, రైతులు యూరియా కోసం మళ్లీ రోడ్డకే పరిస్థితి ఉంటుందని భయంతోనే ప్రస్తుతం అమ్మకాలు నిలిపివేసినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే కొన్నిచోట్ల రైతులు వానకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. యూరియా అమ్మకాల నిలిపివేతతో ఆయా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పోనీ, సాగు మొదలైన తర్వాతనైనా అవసరమైన యూరియా లభిస్తుందా? అంటే ఆ భరోసా కూడా సరార్ నుంచి రావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించి యూరియా అమ్మకాలపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
యూరియా విక్రయాలను నిషేధించిన రాష్ట్ర ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్‌పై కూడా ఆంక్షలు విధించింది. యాప్‌లో యూరియా బుక్ చేసుకోవడానికి వీల్లేకుండా లాక్ చేసింది. తక్షణ అవసరాలు ఉన్న రైతులు ఎవరైనా బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే ప్రస్తుతం యూరియా బుకింగ్ యాప్ పనిచేయడం లేదు. మరోవైపు, ఈ-పాస్ మిషన్లను సైతం పనిచేయకుండా నిలిపివేసింది. దీంతో రైతులు కనీసం ఒక యూరియా బస్తా తీసుకోవడం కూడా సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది.
యూరియా విక్రయాలను నిలిపివేయడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్ణయంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. యూరియా విక్రయాలపై నిషేధం విధించడం ఇదే తొలిసారి అని చెప్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రమైన యూరియా కొరత ఎదురొన్న సందర్భాల్లో సైతం ఇలాంటి నిషేధం విధించలేదని చెప్తున్నారు.