హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): ఒక క్ కవర్ భూమిలో కరగాలంటే ఎన్నేండ్లు పడుతుందో తెలుసా.. అక్షరాలా వెయ్యేండ్లు. అలాంటిది మనం పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనే వరకు ప్రతి పనిలో ప్లాస్టిక్ వినియోగం ఉంటున్నది. ఫలితంగా రాష్ట్రంలో ప్రతి రోజు 60 టన్నులకు పైగా వ్యర్థాలు (పీసీబీ అంచనాల ప్రకారం) పోగు అవుతున్నాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 40 టన్నుల ప్లాస్టిక్.. వ్యర్థాలుగా మారుతున్నది. ప్లాస్టిక్ తయారీ సమయంలోనూ ప్రమాదకర థాలెట్స్, బిస్ఫినాల్ వెలువడతాయి. వీటిని ఇష్టారీతిన బహిరంగంగా కాల్చితే ప్రమాదకర రసాయనాలు వెలువడి వాతావరణం కలుషితం అవుతుంది. అందుకే ఈ రాకాసిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం ఈ నెల 1 నుంచే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను తయారు చేయటం, ఎగుమతి చేయటం, నిల్వ చేసుకోవటం, పంపిణీ చేయటం, వాడటం, విక్రయించడం పూర్తిగా నిషేధం. వీటితో పాటు పాలిైస్టెరిన్ (థర్మాకోల్) అండ్ పాలిైస్టెరిన్ వస్తు సామగ్రిపై పూర్తిగా బ్యాన్ వేశారు. 13కు పైగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రకాలపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిషేధం విధించారు. వాటిని బదులుగా ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సూచిస్తున్నారు.