హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగ సందర్బంగా పతంగులను ఎగురవేసేవారు సింథటిక్ మాంజా/నైలాన్ దారాలను వినియోగించకుండా నిరోధించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మాంజా దారం తయారీ, విక్రయాల ను నిషేధిస్తూ 2017లో జాతీయ హ రిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీ ర్పును పకడ్బందీగా అమలు చేయాల ని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిం ది. రాష్ట్రంలో ఎన్జీటీ తీర్పు అమలు కావడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై అటవీ, పర్యావరణ, హోం శాఖల ముఖ్య కార్యదర్శులతోపాటు డీజీపీకి ఇటీవల నోటీసులు జారీ చేసిన జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి.. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేశారు.
పూల రవీందర్‌కు జీజేఎల్ఏ, టీజీసీటీఏ మద్దతు
హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న పూల రవీందర్‌కు రెండు సంఘాలు మద్దతు తెలిపాయి. గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్(జీజేఎల్ఏ), తెలంగాణ డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీసీటీఏ) సంఘాలు మద్దతు ప్రకటించాయి. జీజేఎల్ఏ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, టీజీసీటీఏ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి బ్రిజేష్ శనివారం పూల రవీందర్‌ను కలిసి మద్దతు లేఖను అందజేశారు. జూనియర్, డిగ్రీ కాలేజీ లెక్చరర్లంతా మొదటి ప్రాధాన్య ఓటును పూలరవీందర్కు వేసి గెలిపించాలని వారు కోరారు.