ముంబై, ఆగస్టు 8: దేశీయ అవసరాల కోసమని, ధరలను అదుపులో ఉంచేందుకని కేంద్ర ప్రభుత్వం గోధుమల ఎగుమతిపై విధించిన నిషేధం పెద్దగా ఫలితం చూపలేదు. అధిక డిమాండ్, తక్కువ సరఫరా నేపథ్యంలో దేశంలో గోధుమల ధర మంగళవారం ఆరు నెలల గరిష్ఠానికి చేరుకొన్నదని వ్యాపార వర్గాలు వెల్లడించాయి. ఇండోర్లో గోధుమ ధర మంగళవారం 1.5 శాతం పెరిగి, మెట్రిక్ టన్నుకు రూ.25,446కు చేరుకొన్నది. ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుంచి ఇదే అత్యధికమని వ్యాపారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన గిడ్డంగుల నుంచి గోధుమల నిల్వలను బహిరంగ మార్కెట్లోకి విడుదల చేయాలనే డిమాండ్ వినిపిస్తున్నది. పండుగ సీజన్ నేపథ్యంలో గోధుమ కొరతను తొలగించేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు. ధరలను నియంత్రించేందుకు దిగుమతులు అవసరమని, దిగుమతులు లేకుండా సరఫరా పెంచడం ప్రభుత్వానికి సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు.