హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థను ఉన్నతస్థాయిలో నిలిపిన వ్యక్తి బలరామ్ అని విశ్రాంత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు అభిప్రాయపడ్డారు. చాలామంది తనను ఆదర్శంగా తీసుకుంటుండగా, తాను మాత్రం బలరామ్‌ను ఆదర్శంగా తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సింగరేణి మాజీ సీఎండీ ఎన్ బలరామ్‌కు పౌర సన్మానాన్ని నిర్వహించారు.
సింగరేణి ఎంప్లాయీస్ అండ్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభలో కాకి మాధవరావు మాట్లాడుతూ.. సమాజ సేవ చేస్తున్న వారిలో బలరామ్ ముందుంటారని కొనియాడారు. ఈ సందర్భంగా బలరామ్ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఐఎస్ జేబీ రాజు, విశ్రాంత ఐఆర్టీఎస్ అధికారి భరత్‌భూషణ్, విశ్రాంత ఐఏఎస్ జీడీ అరుణ, మాజీ మంత్రి రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, తుమ్మల ప్రపుల్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.