హైదరాబాద్ : ఓయూకు వెళ్లి వచ్చి ప్రపంచాన్ని జయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఓయూకు ఏదో చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి అక్కడకు వెళ్లలేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓయూ గత వారం రోజులుగా పోలీసు క్యాంపుగా మారిందని విమర్శించారు. ఉస్మానియాకు వెయ్యి కోట్లు ఇస్తామని అంటున్న రేవంత్ రెడ్డికి ఇన్నాళ్లుగా ఇవ్వడానికి ఎందుకు మనసు రాలేదని ప్రశ్నించారు.
చిత్తశుద్ధి ఉంటే నిన్ననే వెయ్యి కోట్లు ప్రకటించే వారన్నారు. కనీసం రేపు అయినా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలు, విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. యాదయ్య, శ్రీకాంతాచారి బలిదానానికి కారకులు నాడు రేవంత్ రెడ్డి ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబునాయుడు అన్నారు. ఉద్యమం సమయంలో రేవంత్ రెడ్డి ఎక్కడున్నారో అందరికి తెలుసన్నారు. విద్యార్థులను అవమానించిన చరిత్ర ఉన్న రేవంత్ రెడ్డికి ఓయూకు వెళ్లే అర్హత లేదన్నారు.
సీఎం భాష, పద్దతి నయా భూస్వామిలా ఉందన్నారు. 20 నెలల కాలంలో విద్యారంగానికి చేసిందేమీ లేదు. న్యాక్ గుర్తింపు లేక చాలా విశ్వవిద్యాలయాలు ఇబ్బంది పడుతున్నాయి. ఏపీలో తరగతులు ప్రారంభం అవుతుంటే..తెలంగాణలో నీట్ కౌన్సిలింగ్ కూడా పూర్తి కాలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పోలీస్ శాఖ తప్ప ఏ శాఖ కూడా పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు.
తెలంగాణ విద్యార్థి లోకం మరో పోరాటానికి సిద్ధపడుతుందని, యూనివర్సిటీల భూములు అమ్ముకునే సంస్కృతి రేవంత్ రెడ్డిదని మండిపడ్డారు. 20 నెలల్లో విద్యారంగానికి ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైడ్రా రూపంలో పేదలను వేధించిన మానవ మృగం రేవంత్ రెడ్డిని ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్లలో గిరిజనుకు బేడీలు వేసిన మానవ మృగం రేవంత్ రెడ్డి అని కేసీఆర్ మానవీయ విలువలతో రాష్ట్రాన్ని పాలించిన మహానేత అని ప్రశంసించారు.