హైదరాబాద్: నవరాత్రులు పూజలందుకున్న గణేశుడు గంగమ్మ వడికి తరలుతున్నాడు. హైదరాబాద్ నలుమూలల నుంచి ట్యాంక్‌బండ్ వైపు గణనాథులు (Ganesh Shobhayatra) కదులుతున్నారు. ఈ సారి తెల్లవారుజాము నుంచే నిమజ్జనానికి ట్యాంక్‌బండ్ (Tank bund), ఎన్టీఆర్ మార్గ్‌కు వినాయకులు తరలివస్తున్నారు. దీంతో ట్యాంక్‌బండ్ నుంచి అబిడ్స్ వరకు భారీగా నిలిచిన గణేశుడి వాహనాలు. పాతబస్తీ, సికింద్రాబాద్ నుంచి పెద్దఎత్తున వినాయక విగ్రహాలు తరలివస్తున్నాయి.
ఇక ప్రతిష్ఠాత్మక ఖైరతాబాద్ (Khairatabad) మహాగణపతి (Maha Ganapathi) ఉదయం 6 గంటలకే శాభాయాత్ర ప్రారంభమైంది. 10 గంటల వరకు ట్యాంక్‌బండ్‌కు చేరుకోనున్నాడు. మధ్యాహ్నం 12 గంటల వరకు గణనాధుడి నిమజ్జనం పూర్తిచేసేలా అధికారులు ఏర్పాట్లుచేశారు.
మరోవైపు బాలాపూర్ (Balapur) గణేశుడి ఊరేగింపు ప్రారంభమైంది. గ్రామంలో వినాయకుడు ఊరేగుతున్నాడు. బొడ్రాయి వద్దకు వినాయకుడిని తీసుకెళ్లి అనంతరం గ్రామం ప్రధాన కూడలిలో లడ్డూ వేలం వేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు బాలాపూర్ గణేశుడి లడ్డూ ప్రారంభంకానుంది. ఈ ఏడాది 36 మంది వేలంలో పాల్గొననున్నారు. వారిలో ముగ్గురు స్థానికులు ఉన్నారు. గతేడాది బాలాపూర్ గణేశుడి లడ్డు రూ.24.60 లక్షలు పలికింది.