హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): బక్రీద్ (ఈ నెల 27న) సందర్భంగా పశువుల అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సీవీ ఆనంద్ పోలీస్ అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్ మెంట్ స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, పశు సంవర్ధక శాఖ సెక్రటరీ ఇలాంబర్తితో కలిసి సీపీలు, ఎస్పీలతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పశువుల తరలింపునకు అడ్డుకట్ట వేసేందుకు ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ సరిహద్దుల్లో 52 అంతర్రాష్ట్ర చెక్పోస్టులతోపాటు మొత్తం 203 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
పశువుల రవాణాపై సమాచారం ఉంటే పోలీసుల దృష్టికి తేవాలని, రోడ్లపై ఆందోళనలు చేయవద్దని ఖురేషీలు, గోరక్షక బృందాలకు డీజీపీ సూచించారు. అనవసర రాద్ధాంతం చేసిన వారిపై క్రిమినల్ కేసులు ఫైల్ చేస్తామని హెచ్చరించారు. కాన్ఫరెన్స్లో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గోపి, డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేశ్ ఎం భగవత్, ఐజీపీలు చంద్రశేఖర్రెడ్డి, షానవాజ్ ఖాసీం, కార్తికేయ, ఇంటెలిజెన్స్ డీఐజీ భాస్కరన్ తదితరులు పాల్గొన్నారు.