కరీంనగర్, జనవరి 15 (నమస్తే తెలంగాణ): జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ను నిలదీసిన కేసులో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. సోమవారం రాత్రంతా కరీంనగర్ త్రీ టౌన్ పోలీసు స్టేషన్లోనే బంధించిన పోలీసులు, మంగళవారం ఉదయం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వాదనలు విన్న మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే పీఏ వినోద్‌తోపాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లయ్య, కరీంనగర్ ఆర్డీవో మహేశ్ ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్‌లో కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసిన పోలీసుల రాత్రి 9 గంటలకు కరీంనగర్‌కు తరలించారు. స్టేషన్ బెయిల్ కోసం బీఆర్ఎస్ నాయకులు, న్యాయవాదులు సర్దార్ రవీందర్‌సింగ్, నారదాసు లక్ష్మణ్‌రావు పోలీసులను సంప్రదించినా ఫలితం లేకుండాపోయింది. తర్వాతి రోజు ఉదయం ప్రముఖ న్యాయవాదులు మధుసూదన్‌రావు, సర్దార్ రవీందర్‌సింగ్ వాదనలతో ఏకీభవించిన మెజిస్ట్రేట్ రెండు కేసుల్లో బెయిల్ మంజూరు చేశారు. ఈ నెల 16న రూ.2 లక్షల ష్యూరిటీలు అందించాలని ఆదేశించారు. కాగా, కౌశిక్ అరెస్టుతో కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొన్నది. బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.