నల్లగొండ ప్రతినిధి, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ తీరుతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారని బీఏఐ మాజీ అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి, ఆలిండియా మాజీ ఉపాధ్యక్షుడు డీవీఎన్ రెడ్డి తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయని ఆం దోళన వ్యక్తం చేశారు. సోమవారం నల్లగొండలో ఉమ్మడి జిల్లా కాంట్రాక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఈ నెల 18న చలో హైదరాబాద్ కార్యక్రమంపై చర్చించారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. డ్రైనేజీ నుంచి పెద్ద పెద్ద డ్యామ్ల వరకు ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖల్లో చేపట్టిన పనులకు పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. తాము కోట్ల రూపాయలు పెట్టి పనులు చేపట్టి ఆ పనులు బిల్లుల కోసం వెళ్తుంటే దొంగల్లా చూడటం బాధకలిగిస్తున్నదని చెప్పారు. నాగర్కర్నూల్లో శ్రీనివాసరెడ్డి అనే కాంట్రాక్టర్కు రూ.10 కోట్ల బిల్లులు రాకపోవడంతో మూడు నెలల కిందట ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపారు. ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నదని, ఇప్పటివరకు కాంగ్రెస్ సర్కార్ రూపాయి కూడా చెల్లించలేదని మండిపడ్డారు.