హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : సర్కారు బడుల్లో నమోదు పెంచడమే లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం గురువారం ప్రారంభంకానున్నది. ఈ మేరకు బుధవారం సమగ్రశిక్షా స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ మల్లయ్యభట్టు మారిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. తాజాగా జూన్ 6 నుంచి 19 వరకు నిర్వహిస్తామని షెడ్యూల్‌ను ఖరారుచేశారు. బడుల ప్రారంభానికి ముందు ఈ నెల 6 నుంచి 11 వరకు, బడులు ప్రారంభమైన తర్వాత ఈ నెల12 నుంచి 19 వరకు రెండు విడతల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు.
శాఖల సమన్వయంతో
బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిర్వహించాలని అధికారులు సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ, మున్సిపల్ అడ్మినిస్రేషన్, కార్మికశాఖ, మహిళాశిశుసంక్షేమశాఖలను భాగస్వామ్యం చేస్తూ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వశాఖ అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, స్వయం సహాయక సంఘాలు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల సహకాన్ని తీసుకోవాలని తెలిపారు.ఈ నెల 10లోపు ఒక జత యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్, నోటుబుక్స్‌ను విద్యార్థులకు పంపిణీచేయాలని ఆదేశించారు.
బడిబాటను విజయవంతం చేద్దాం: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషిచేద్దామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 6 నుంచి 19 వరకు జరిగే బడిబాటను విజయవంతం చేయాలని కోరారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తరగతికి ఒక టీచర్ ఉండేలా చూడాలని, సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. టీచర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను సజావుగా పూర్తిచేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధానకార్యదర్శి చావ రవి కోరారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్ రాములు, సీహెచ్ దుర్గాభవాని, కోశాధికారి లక్ష్మారెడ్డి, మాణిక్‌రెడ్డి, ఎం రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
12న సీఎం హాజరయ్యే చాన్స్
బడిబాటలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే అవకాశాలున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే జూన్ 12న సీఎం రేవంత్‌రెడ్డి ఒకట్రెండు పాఠశాలల్లో పాల్గొనేలా కార్యక్రమాన్ని రూపకల్పనచేశారు. సీఎం చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్, వర్క్‌బుక్స్‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు.