ములుగు, అక్టోబర్17(నమస్తేతెలంగాణ): 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మహిళా సంక్షేమం శూన్యమని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి(Bade Nagajyothi )అన్నారు. మంగ ళవారం ములుగులో రెడ్కో చైర్మన్ ఏరువ సతీశ్‌రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
మహిళా డిక్లరేషన్ పేరుతో రేపు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్పలో పర్యటించనున్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ 50 ఏళ్ల వారి పాలనలో మహిళా సంక్షేమానికి చేసింది ఏమిటో రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2005లో రూపొందించిన పోడు భూముల చట్టం కారణంగా రాష్ట్రంలో ఇప్పటికీ కొంత మంది పోడు హక్కు దారులకు పట్టాలు జారీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు.
కాంగ్రెస్ నాయకులు ప్రకటించిన 6 గ్యారెంటీలు వారు పరిపాలిస్తున్న ఇతర రాష్ర్టాల్లో అమలవుతున్నాయా అనేది రాహుల్ గాంధీ ప్రజలకు తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలపై అవగాహన ఉన్న సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంపై అవగాహన లేని కాంగ్రెస్ నాయకుల పర్యటన వల్ల ములుగు ప్రాంతానికి ఒరిగేది ఏమి లేదని నాగజ్యోతి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్‌నాయక్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.