ములుగు : జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కొనసాగుతున్న బడే నాగజ్యోతిని రాబోయే ఎన్నికలలో ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ అగ్ర నేతలైన బడే నాగేశ్వరరావు అలియాస్ ప్రభాకరన్న, బడే రాజేశ్వరి అలియాస్ నిర్మలక్కల కుమార్తె అయిన నాగజ్యోతి 29 ఏళ్ల చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా అభ్యర్థిగా బరిలో నిలువ బోతున్నారు.
సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ తెలంగాణ భవన్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన చేస్తుండగా ములుగులోని తన ఇంట్లో ఉన్న నాగజ్యోతి టీవీలో తన పేరును ప్రకటిస్తుండడాన్ని చూస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర, జిల్లా మంత్రులకు నాగజ్యోతి ధన్యవాదాలు తెలియజేశారు.
ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బడే నాగజ్యోతి పేరును సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తన గెలుపునుసీఎం కేసీఆర్కు కానుకగా ఇస్తానని తెలిపారు. అవకాశం కల్పించిన కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.